Nandini Ghee to Tirumala Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణ పెద్ద సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వివాదానికి ముందు తిరుపతి లడ్డూకు 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడేవారు. కానీ 2023లో ధరల సమస్యను కారణంగా చూపుతూ నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. తాజా వివాదంతో తిరుమలకు స్వచ్ఛమైన నందిని నెయ్యిని మాత్రమే వాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతి లడ్డూకి నందిని నెయ్యి:తిరుపతి లడ్డూ తయారీలో కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నందిని నెయ్యి గత 20 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. అయితే 2022-23లో ధర ఎక్కువగా ఉందనే కారణంతో తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయింది. టీటీడీకి 2013-14 నుంచి 2021-22 వరకు 5 వేల టన్నుల నెయ్యిని కేఎంఎఫ్ (Karnataka Milk Federation) సరఫరా చేసింది. 2022-23లో కేఎంఎఫ్ నెయ్యిని సరఫరా చేయలేదు. అధిక ధర ఉందనే కారణంగా చూపుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నందిని నెయ్యి టెండర్ని తిరస్కరించింది.
కిలో నందిని నెయ్యి రూ.478: తాజా వివాదం నేపథ్యంలో 2024-25 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని ఆర్డర్ ఇచ్చారు. కిలో నందిని నెయ్యిని 478 రూపాయల చొప్పున టీటీడీ KMF నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తుంది. దీంతో ఇప్పుడు మళ్లీ తిరుమల లడ్డూకి నందిని నెయ్యి సువాసనలు కలవనున్నాయి.
"తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాకు నెయ్యి సరఫరా ఆర్డర్ వచ్చింది. తిరుమల అధికారులు కొద్ది రోజుల క్రితమే 350 మెట్రిక్ టన్నుల నెయ్యి కోసం ఆర్డర్ చేశారు. బెంగళూరులోని KMF నుంచి మేం అంత నెయ్యిని సరఫరా చేస్తాం. ఆవు నెయ్యిని మాత్రమే తిరుమలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చాం. స్వామివారి ప్రసాదంలో ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు". -ఈటీవీ భారత్తో భీమా నాయక్, KMF ప్రెసిడెంట్