Kapildev Met CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ చర్చించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి కపిల్ దేవ్ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించారు.
క్రీడలపై కూడా సీఎం చంద్రబాబుకు చాలా ఉత్సుకత ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందని తెలిపారు. చంద్రబాబు నుంచి ప్రామిస్ అనేకంటే ఆయన బ్లెస్సింగ్ వచ్చాయన్నారు. ఇండియన్ గోల్ఫ్కి తాను ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్నానని తెలిపారు. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే నిర్ణయమన్నారు. స్పోర్ట్స్ సిటీలో ఇస్తే చాలా సంతోషిస్తానని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
Chandrababu Tweet on Meeting With Kapil Dev: లెజెండరీ క్రికెటర్, పీజీటీఐ (Professional Golf Tour of India) ఛైర్మన్ కపిల్ దేవ్, ఆయన ప్రతినిధులతో భేటీ ఎంతో ఆహ్లాదకరంగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్‌లో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించడం గురించి చర్చించామన్నారు.