Kakinada PDS Rice Issue: స్టెల్లా నౌక నుంచి రేషన్ బియ్యాన్ని అధికారులు పూర్తిగా అన్‌లోడ్ చేశారు. 1,320 టన్నుల రేషన్ బియ్యం షిప్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 బార్జీల్లో బియ్యాన్ని ఒడ్డుకు చేర్చి పౌరసరఫరాలశాఖ అధికారులకు అప్పగించారు. బియ్యాన్ని యాంకరేజ్ పోర్టు గిడ్డంగిలో నిల్వచేయనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో గత నవంబర్‌లో స్టెల్లా నౌకను అధికారులు కాకినాడ పోర్టు తీరంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా బియ్యం అన్‌లోడ్ పూర్తి అవ్వడంతో స్టెల్లా నౌక త్వరలోనే గమ్యస్థానానికి బయలుదేరనుంది. నవంబర్ 11వ తేదీన హల్దియా నుంచి వచ్చిన స్టెల్లా నౌక కాకినాడ యాంకరేజీ పోర్టుకు 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసింది. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ కొటోనౌ పోర్టుకు 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. 32,415 టన్నుల బియ్యాన్ని నౌకలో నింపగా కలెక్టర్, అధికారుల బృందం తనిఖీల తర్వాత 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
త్వరలోనే 'స్టెల్లా'కి మోక్షం - రేషన్ బియ్యం దించివేత ప్రారంభం
అనంతరం అక్కడికెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ స్టెల్లా నౌకని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో శుక్రవారం నుంచి నౌకలోని బియ్యం దించే ప్రక్రియను ప్రారంభించారు. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో రేషన్ బియ్యాన్ని క్రేన్ సాయంతో పూర్తిగా అన్‌లోడ్ చేశారు. బియ్యం పూర్తిగా అన్‌లోడ్ కావడంతో ప్రస్తుతం 19,785 టన్నుల సాధారణ బియ్యం లోడింగ్‌కు ఎగుమతిదారులకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత జనవరి 3, 4వ తేదీల్లో స్టెల్లా షిప్ కొటోనౌ పోర్టుకు బయలుదేరే అవకాశం ఉంది. అయితే స్టెల్లా షిప్ బయలుదేరేందుకు ప్రభుత్వ అనుమతితో పాటు పోర్టు అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు కాకినాడ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న పీడీఎస్ బియ్యం రవాణా అడ్డుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చెక్‌పోస్టులు పెంచినా, కీలక డిపార్ట్మెంట్ల టీమ్‌లు తనిఖీలు ముమ్మరం చేసినా రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన సిట్ (Special Investigation Team) రావడంలో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. సిట్‌లోని అధికారుల్లో మార్పులు చేర్పులు చేయడంతో కొత్త టీమ్ ఎప్పుడు వస్తుందో అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బియ్యం దొంగల భరతం పట్టేందుకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కార్