Kadapa TDP Leaders Complaint to SP :కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల అండదండలతో దాడులకు పాల్పడటమే కాకుండా బూతు పురాణం వల్లెవేస్తూ మహిళలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు అహ్మద్ బాషా వ్యవహారశైలి గ్యాంగ్ స్టర్ నయీం తరహాలో ఉందని అతన్ని వెంటనే నగర బహిష్కరణ చేయాలని తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా దౌర్జన్యాలు, దోపిడీలు తారా స్థాయికి చేరాయని కడప తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కడపలో అహ్మద్ బాషా నుంచి తమకు ప్రాణహాని ఉందని, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తెలుగుదేశం కడప ఇంఛార్జి మాధవీరెడ్డిపై అసభ్యకరంగా మాట్లాడిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఏడాది కిందట వినాయక్ నగర్ లో ఓ మైనారిటీ నాయకుడి స్థలాన్ని ఆక్రమించేందుకు అహ్మద్ బాషా తన అనుచరులతో హల్ చల్ చేయడం తీవ్ర దుమారం రేపింది.
అహ్మద్ బాషా కడప నయీం కావాలని చూస్తున్నాడు: టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి
శుక్రవారం టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగగా టీడీపీ కార్యకర్త అరీఫుల్లాపై పోలీస్ స్టేషన్లోనే మంత్రి సోదరుడు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, అతని భార్య మాధవీరెడ్డిని ఉద్దేశిస్తూ ఇంటికి వచ్చి దాడి చేస్తానని మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా పోలీసులు మిన్నకుండిపోయారని టీడీపీ నేతలుఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం సీసీ టీవీలో నమోదైందని అంజాద్ బాషా సోదరుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాధవీరెడ్డి, టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.