EX CM Jagan Embroiled in Adani Bribery Case :అదానీ సంస్థతో గత వైఎస్సార్సీపీ సర్కార్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో సరి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజూర్ పవర్ (Azure Power)కు బదులు అదానీ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్తు కొని రాష్ట్రానికి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో రెండు వేరు వేరు అనుబంధ విద్యుత్తు విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెకికి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ (K.Vijayanand) అనుమతులు ఇచ్చేశారు. మంత్రి వర్గ ఆమోదం లేకుండానే ఈ అనుబంధ ఒప్పందాలు జరిగాయి. వ్యవహారం అంతా చక్కబెట్టేశాక ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో తన నిర్ణయాలకి ర్యాటిఫికేషన్ కోరుతూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విచిత్రం ఏమిటి అంటే ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నది కూడా ఆయనే. అలా ఈ ఒప్పందంలో కె.విజయానంద్ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
ఆ సంస్థలతో మరో ఒప్పందం :సెకి నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు కోసం డిస్కంలతో కలిపి ప్రభుత్వం 2021 డిసెంబరు 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగావాట్లు అదానీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి, 2,333 మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా (Azure Power India) నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకి ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది.
సెకికి వ్యతిరేకంగా సెకికి రిట్ పిటిషన్ : 2,333 మెగావాట్ల సౌర విద్యుత్తు సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సీటీయూఐఎల్ (CTUIL) 2023 జులై 6న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. సెకితో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెకికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ పిటిషన్ (Writ Petition) వేసింది.
సెకితో సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందం - అధిక ధర ఎందుకంటే - అడ్డగోలు వాదన
విజయానంద్ లేఖ :అజూర్ పవర్ వైదొలగుతున్నందున 2,333 మెగా వాట్ల విద్యుత్తును తమకు ఎక్కడి నుంచి, ఎలా సరఫరా చేస్తారో తెలియజేయాలంటూ ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో గత సంవత్సరం ఆగస్టు 30న విజయానంద్ సెకికి లేఖ రాశారు.
అదానీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి కొంటాం :విజయానంద్ లేఖ రాసిన తరువాత సెకి సీఎండీ ఆయనతో సమావేశం అయ్యారు. అజూర్ పవర్ సరఫరా చేయాల్సిన 2,333 మెగావాట్లను తాము అదానీ రెన్యువబుల్ ఎనర్జీ (Adani Renewable Energy) నుంచి కొంటామని అన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనలు, షరతులు నిర్ణయించిన టారిఫ్ ప్రకారమే అదానీ నుంచి కొంటామని, ఆ ప్రాజెక్టులు ప్రారంభం చేయాల్సిన టైమ్‌లో మాత్రం మార్పులు ఉంటాయని తెలిపారు.
ఆ సమావేశంలో తీర్మానం :అదానీ నుంచి 1,799 మెగావాట్లు, 534 మెగా వాట్ల కొనుగోలు కోసం వేర్వేరుగా 2 విద్యుత్తు విక్రయ- పీఎస్‌ఏ అనుబంధ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమ్మతించాలని కోరుతూ సెకి 2023 నవంబరు 21న విజయానంద్‌కు లేఖ రాసింది. ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో కె.విజయానంద్ దానికి సమ్మతిచ్చేశారు. గత సంవత్సరం నవంబరు 27న జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
ఉల్లంఘనలకు పాల్పడిన కె.విజయానంద్ : సెకి నుంచి 7 వేల మెగా వాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు కోసం 2021 డిసెంబరు 1న కుదిరిన ప్రధాన ఒప్పందం మంత్రి వర్గం ఆమోదం మేరకే జరిగింది. అందులో మార్పులు చేయాలంటే కచ్చితంగా ఆ విషయం మంత్రి వర్గం దృష్టికి తీసుకెళ్లాలి. అనుబంధ ఒప్పందాలకు మంత్రి వర్గ ఆమోదం తప్పనిసరి. గత ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు లేకుండా అనుబంధ ఒప్పందాలకు ఏపీపీసీసీ (APPCC) సమ్మతి ఇవ్వకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కె.విజయానంద్ వాటికి సమ్మతి ఇచ్చేశారు. ఇలా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
ప్రభుత్వమే భరించాలి :తరువాత అజూర్ బదులు అదానీ నుంచి 1,799 మెగావాట్ల విద్యుత్తును సెకి కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా 2023 డిసెంబరు 29న అనుబంధ విద్యుత్తు విక్రయ ఒప్పందం -1 సెకి, ఏపీ డిస్కంలు, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. ఏపీపీసీసీ నిర్ణయం మేరకు ఈ ఒప్పందం జరిగింది. ప్రధాన ఒప్పందంతో పాటు ఈ అనుబంధ ఒప్పందాన్ని కూడా ఏపీఈఆర్‌సీ (APERC) సమ్మతి కోసం ఈ సంవత్సరం జనవరి 1న పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏప్రిల్ 12న ఏపీఈఆర్‌సీ (APERC) ఈ ఒప్పందాలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యుత్తు కొనుగోలుకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది.
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!
ఎన్నికలకు ముందు ఒప్పందం : అజూర్ బదులు అదానీ నుంచి 534 మెగా వాట్ల విద్యుత్తును సెకి కొనుగోలు చేసి ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి 1న అనుబంధ విద్యుత్తు విక్రయ ఒప్పందం-2 సెకి, ఏపీ డిస్కం (AP DISCOM)లు, ప్రభుత్వం మధ్య కుదిరింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు 16 రోజుల ముందు ఒప్పందం జరిగింది. ఏపీఈఆర్‌సీ (APERC) అనుమతి కోసం దీన్ని పంపించారు. ఇప్పుడు కమిషన్ వద్ద ఇది పెండింగ్‌లో ఉంది.
ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే : మంత్రి వర్గం ఆమోదం లేకుండానే ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో అనుబంధ ఒప్పందాలకు అనుమతి ఇచ్చేసిన కె.విజయానంద్ ఈ నిర్ణయాలను అన్నింటినీ ర్యాటిఫై చేయాలంటూ మే 14న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఈ లేఖ పంపించారు.
ర్యాటిఫికేషన్ చర్యలు : అనుబంధ ఒప్పందాలకు అనుమతిస్తూ తాను తీసుకున్న నిర్ణయాలకు ర్యాటిఫికేషన్ కోరుతూ లేఖ రాసిన సమయంలో ఏపీపీసీసీ (APPCC) ఛైర్మన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో విజయానందే ఉన్నారు. ఏపీపీసీసీ (APPCC) ఛైర్మన్ హోదాలో ఆయన ఇచ్చిన అనుమతులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనే ర్యాటిఫికేషన్ చర్యలు చేపట్టాలి.
సెకితోనే విద్యుత్ ఒప్పందం :సెకి అనుబంధ ఒప్పందాలు మంత్రి వర్గానికి ఎందుకు పంపలేదని విద్యుత్ శాఖలో ఉన్నత అధికారి ఒకరిని వివరణ కోరగా ప్రభుత్వం సెకితోనే విద్యుత్ ఒప్పందం చేసుకుందని ఆ అధికారి తెలిపారు. ఆ సంస్థ ఎవరి నుంచి తీసుకుంటుందో తమకు అక్కర్లేదని అన్నారు. గతంలోనే ఏడు వేల మెగా వాట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అంతకుమించి విద్యుత్ తీసుకుంటేనే మంత్రి వర్గ ఆమోదం అవసరమని ఆ అధికారి పేర్కొన్నారు.
సెకి దస్త్రం పరుగులు - 7 గంటల్లోనే ఆమోదం