Jayaho Bharat Art Competition in Vijayawada:కొండలు కనువిందు చేస్తాయి. నదులు నాట్యమాడుతాయి. పల్లె పులకరిస్తుంది. ప్రకృతి పరవశిస్తుంది. మనసు తన్మయం చెందుతుంది. ఇవన్నీ చిత్రకారులు ఊహించే వేసే చిత్రకళలో ఉట్టిపడతాయి. ఆలోచనలకు అద్భుత రూపమిచ్చి చూపరులను మైమరిపిస్తాడు చిత్రకారుడు. ఆలాంటి నైపుణ్యాలకు ఊతమిచ్చేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జయహో భారత్ ఆర్ట్ కాంటెస్టు వేదికైంది.
అద్భుత చిత్రాలకు ఆలోచనలే సోపానాలు. అలాంటి చిత్రలేఖనంలో తమదైన ప్రతిభ చాటారీ విద్యార్థులు. కళానైపుణ్యంతో బొమ్మలకు ఆకారన్నిచ్చి కట్టిపడేస్తున్నారు. విద్యార్థుల్లోని చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వేదికైంది విజయవాడలో జరిగిన జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్టా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 12వందల మంది విద్యార్థులు చిత్రలేఖనంతో ఆకట్టుకున్నారు.
రెండేళ్లుగా జయహో భారత్- భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. అనే పేరుతో చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు ఇలాంటి కళాత్మక పోటీల్లో పాల్గొని దేశ నాయకుల చిత్రాలు వేయడం తమకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు.