Jani Master Arrested : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని లాడ్జిలో అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అతనిపై పొక్సో యాక్ట్ సైతం నమోదు చేశారు.
బాధితురాలి వాంగ్మూలం నమోదు :అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీమాస్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలిపై అఘాయిత్యం జరిగినప్పుడు మైనర్ అని తేలడంతో పోక్సో చట్టం చేర్చారు. ఈ వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. వాంగ్మూలం సేకరణ, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. జానీ మాస్టర్ లద్దాఖ్, నెల్లూరులో సినిమా చిత్రీకరణలో ఉన్నారని, అరెస్ట్ చేసేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలతో వెళ్లినట్లు ప్రచారం బుధవారం జరిగినా పోలీసులు దానిని కొట్టేపారేశారు. ఎట్టకేలకు గోవాలో అతనిని అరెస్ట్ చేశారు.