Jalaharati Program at Pulichintala Project:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరాంతాతయ్య అన్నారు. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటికి కిందికి విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మూడేళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండనుంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం వస్తున్న వరద, నీటి నిల్వకు అధికారులు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు జలకళ:మూడేళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద పులిచింతలలోకి వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 30 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 5 గేట్లు ఎత్తి 96,898 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పది వేల క్యూసెక్కుల నీరు మళ్లిస్తున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణా నదిలో పడవలు, బల్లకట్టులను నిలిపివేశారు. వచ్చే వరదతో మరికొన్ని గేట్లు ఎత్తేందుకు అధికారుల ప్రణాళికలు రచిస్తున్నారు.