Jagan Vidya Deevena Problems to Students and Parents in Chittoor : బంగారుపాళ్యానికి చెందిన మహేష్‌కుమార్ తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో అతని తల్లి డ్వాక్రా సంఘంలో రుణం తీసుకుని రూ.లక్ష ఫీజు చెల్లించారు. ప్రతి నెలా వడ్డీతో కలిపి, రుణ వాయిదాలు కడుతున్నారు. విద్యా దీవెన అందితే అప్పు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, ఇప్పుడు తమపై వడ్డీ భారం పడిందని భావి ఇంజినీర్ వాపోయాడు.
పూతలపట్టుకు చెందిన ప్రశాంత్ తిరుపతిలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. గతేడాదికి సంబంధించి విద్యా దీవెన నిధులు ఇప్పటికీ అందకపోవడంతో ఫీజు బకాయి చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. వారి ఒత్తిడితో అప్పు చేసి ఫీజు చెల్లించారు. దానికి వడ్డీలు కడుతున్నామని, విద్యా దీవెన విడుదలైతే తమకు కొంత మేరకైనా అప్పు భారం తగ్గుతుందని ప్రశాంత్ చెబుతున్నాడు.
అంతన్నారు ఇంతన్నారు ఫీజులన్నీ బకాయిపెట్టారు- దీవెనలేవి మామయ్యా? - Jagananna Vidya Devena Scheme
‘ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్నదే లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని ప్రతి విద్యార్థీ చక్కగా చదువుకోవాలి. అందుకయ్యే ఫీజు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే విద్యా దీవెన నిధులు జమ చేస్తున్నాం’ -విద్యా దీవెనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి గత డిసెంబరులో మొదటి త్రైమాసిక విద్యా దీవెన నిధులను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కారు. నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకు తల్లుల ఖాతాల్లో ఆ నిధులు జమ కాలేదు.
ప్రభుత్వం ఇచ్చే విద్యా దీవెన నిధులపై ఆధారపడి ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాల విద్య అభ్యసిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులను అమ్మఒడి పథకంలో చేర్చడంతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, తత్సమాన కోర్సుల విద్యార్థులకు విద్యా దీవెన ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే విద్యాదీవెనను నమ్ముకుని ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో విద్యా దీవెన నిధులను విడుదల చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.
విదేశీ విద్యాదీవెనలోనూ జగన్నాటకం
బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు :గతంలో విద్యార్థులకు సంబందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కళాశాలలకే విడుదల చేసేవారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తుండటం, సకాలంలో ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి చేస్తోంది. చదువు పూర్తయిన వాళ్లకు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని స్పష్టం చేస్తున్నాయి. విద్య కొనసాగిస్తున్న వారికి ఫీజు చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వారు సొంత నగదు చెల్లిస్తున్నారు. లేనివారు కళాశాలల ఒత్తిడి భరించలేక తరగతులకు గైర్హాజరవుతున్నారు. ఏడాది మొత్తానికి సంబంధించి నిధులు అందకుంటే తామెక్కడి నుంచి తేవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక
విద్యార్థుల్లో ఆందోళన :ఒక విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా విద్యా దీవెన విడుదల చేస్తారు. గతేడాదికి సంబంధించి ఒక విడత మాత్రమే విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మొన్న మార్చిలో బటన్ నొక్కినా ఇప్పటివరకు ఆ నిధులు చాలామందికి అందలేదు. ఇంకా మూడు విడతలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూనే పరీక్షలు పూర్తయి విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరకుంది. మరో నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితిల్లో ఇప్పట్లో విద్యా దీవెన వస్తుందా? రాదా? అనే అనుమానం విద్యార్థుల్లో నెలకొంది. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
నమ్మి అప్పులపాలయ్యాం : 'ఇద్దరు కుమార్తెలు బీటెక్ చదువుతున్నారు. ప్రైవేటు కళాశాల, వసతి గృహానికి రూ. 4.50 లక్షలు వెచ్చించాం. నాలుగేళ్లలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఒకరికే రూ.50 వేల సాయం అందింది. బీటెక్ మొదటి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థినికి ప్రభుత్వం విద్యా, వసతి దీవెన అందలేదు. జగనన్న ప్రకటించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను నమ్మి బిడ్డలను చదివిస్తూ రూ.4 లక్షల అప్పు చేశాం. సర్కారు సాయం పూర్తి స్థాయిలో అందని కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది.' -సరిత, ఎం.శాంతంపల్లె, శాంతిపురం మండలం