Jagan spoiled Dairy Development in Andhra Pradesh : పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. పాల సేకరణలో అమూల్ సంస్థకు అన్నీ తానై సమకూర్చి పెట్టిన ఆయన పాడి రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పాడి పథకాలన్నీ పక్కన పెట్టేశారు. పశువులకు నీడనిచ్చే గోకులం పథకాన్ని మొత్తంగా చాప చుట్టేశారు. పశుగ్రాస క్షేత్రాలకు ఉపాధి హామీ నిధుల కేటాయింపును ఎండగట్టారు. రాయితీపై అందించే పాతర గడ్డిని పీకి పడేశారు. పశుబీమా ప్రీమియం భారాన్ని అన్నదాతల నెత్తినే మోపారు.
నీడ లేకుండా చేశారు :పశువులను అపరిశుభ్రత ప్రాంతంలో కట్టి ఉంచడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతాయి. పాములు, ఇతర విష జంతువుల బారిన పడుతుంటాయి. పశువుల సంరక్షణలో మెరుగైన పద్ధతులు పాటించేలా గత ప్రభుత్వం గోకులం, మినీ గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణం చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో 4,950 గోకులాలు నిర్మించారు. వీటికి సంబంధించి సుమారు రూ. 30 కోట్ల బిల్లులు ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువు తీరాక ఈ గోకులాలను పూర్తిగా పక్కన పెట్టేసి, పశువులకు నీడ లేకుండా చేసింది. ఫలితంగా మూగజీవాలు వ్యాధుల బారిన పడి పాల ఉత్పత్తి తగ్గిపోతోంది.
ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy
పశుగ్రాస క్షేత్రాలు మాయం :గత ప్రభుత్వ హయాంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పేరిట రైతులతో మేలురకం గడ్డిని పెంచేవారు. ఉపాధి హామీ ద్వారా గడ్డి పెంపకానికి అవసరమైన నిధులను సాయం చేసేవారు. జిల్లాలో వెయ్యి హెక్టార్ల వరకు పశుగ్రాస క్షేత్రాలుండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం నుంచి పశుగ్రాస పెంపకాన్ని తప్పించారు. నిధులను నిలిపేశారు. రైతులకు ఈ గ్రాసం పెంచడం భారంగా మారడంతో చాలామంది వీటి పెంపకాన్ని విరమించుకున్నారు. నాణ్యమైన పశుగ్రాసం స్థానంలో ఎండుగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడం లేదని రైతులంటున్నారు.
రాయితీకి పాతరేశారు :గతంలో పాతర గడ్డిని (సైలేజ్) కిలో రూ.2 చొప్పున రాయితీపై రైతులకు అందజేసేవారు. ఈ గడ్డిలో పోషకాలు ఎక్కువగా ఉండడంతో పాల ఉత్పత్తి పెరగడానికి దోహదపడేది. పశువులు కూడా ఈ గడ్డిని తినడానికి ఇష్టపడేవి. ఈ ప్రభుత్వం వచ్చాక మొదట్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై అందించేవారు. కొన్నాళ్లు తర్వాత ఈ గడ్డి సరఫరాను నిలిపేశారు. ఇప్పుడు కొన్ని పాలసేకరణ కేంద్రాలు కిలో రూ. 5 నుంచి రూ. 8 చొప్పున రైతులకు విక్రయిస్తున్నాయి. అంత మొత్తం భరించలేని రైతులు వాటి స్థానంలో ఇతర దాణాలు వాడుతున్నారు.
అమూల్‌పై ఎనలేని ప్రేమ - కోట్ల విలువైన సహకార డెయిరీలు అప్పగింత