Jagan Photos and YCP Colors For Central Schemes : సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతను మనం వినే ఉంటాం. అచ్చం అదే సామెతను నిజం చేసి చూపిస్తోంది జగన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను తమ పథకాలుగా చెప్పుకోవడమే కాకుండా వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేసి నీచ రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి విషయాలపై కేంద్రం పలుమార్లు జగన్ ప్రభుత్వంపై కన్నెర్రజేసినా ప్రచార పిచ్చి మాత్రం పోలేదు. ఇప్పటికే ప్రచార యావతో పిల్లల స్కూలు పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటా జగన్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జగన్ బొమ్మలు పెడుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇంటింటికి ఓ కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలని నిశ్చయించుకుంది. ఈ పథకానికి అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందల్లా గ్రామాలను ఎంపిక చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం.
Drinking Water Problem Konaseema District : ఈ పనులను జగన్ సర్కారు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించింది. ఇప్పటికి పనులు అప్పగించి నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా పనులు చేపట్టింది. అది కూడా లబ్థిదారులకు పూర్తిగా న్యాయం చేయకుండా తూతూమంత్రంగా కానిస్తున్నారు.