భగీరథునిలా హామీలు అడుగు పడని పనులు - హంద్రనీవాకు నీళ్లు రావా జగన్? Irrigation Project Works not Completed in Jagan Govt:ప్రతిపక్ష నాయకుడిగా 2017 ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన మహాధర్నాలో జగన్ కల్లబొల్లి మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేస్తామని గద్దెనెక్కి పదవీకాలం పూర్తవుతున్నా పనుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. హంద్రీనీవా ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని 6.383 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. శ్రీశైలం జలాశయంలోని నీటిని వివిధ దశల్లో ఎత్తిపోసి మొత్తం 40 టీఎంసీలను వినియోగించాలనేది ప్రణాళిక.
తొలిదశలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 80 వేలు, అనంతపురం జిల్లాలో లక్షా 18వేల ఎకరాలకు, రెండో దశలో ఉమ్మడి అనంతపురంలో 2లక్షల 27వేలు, కడపలో 37వేల 500 వందలు, చిత్తూరులో లక్షా 40వేల ఎకరాలకు సాగునీళ్లివ్వాలి. ఈ పథకానికి ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేయగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో 2019 నాటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ తన ఐదేళ్ల పరిపాలనా కాలంలో మిగిలిన కొద్దిపాటి పనులను చేయలేక చేతులెత్తేశారు.
జగన్ హామీల డ్రామాలకు నిదర్శనం వరికపూడిశెల- పల్నాడు గడ్డకు వైఎస్సార్సీపీ తీరని ద్రోహం - Varikapudishela Project
మెజార్టీ పనులు 2019 నాటికే పూర్తి:సీఎంగా జగన్ బడ్జెట్‌లో హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు కేటాయించలేదు. ఇచ్చిన వాటినీ పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. అధికారిక గణాంకాల ప్రకారం 2019-20లో 232.66 కోట్లు, 2020-21లో 240.50 కోట్లు, 2021-22లో 31.31 కోట్లు, 2022-23లో 542.87 కోట్లు, 2023-24 డిసెంబరు వరకు 172 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జీతాలు, నిర్వహణ ఖర్చులు, పాత బిల్లుల చెల్లింపులూ కలిసి ఉన్నాయి. ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు చేసి, అనేక పనుల్ని చేయకుండానే వదిలేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో తొలిదశలో ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారో ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
అధికారిక లెక్కల ప్రకారం చూసినా నాలుగు జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా మాత్రమే పనులయ్యాయి. పైగా వాటిలో మెజార్టీ పనులు 2019 నాటికే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో 42వేల 982 ఎకరాలు, అనంతపురంలో 20వేల ఎకరాలు, చిత్తూరులో 16వేల 952 ఎకరాలు, కడప జిల్లాలో 25వేల 649 ఎకరాలకు నీళ్లందించేలా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొంటున్నారు. కానీ ఈ ఆయకట్టుకూ పూర్తిస్థాయిలో నీరందించే పరిస్థితులు లేవు. సీఎం జగన్ 2020 జులైలో కొన్ని పనుల ప్యాకేజీలను రద్దు చేసి అంచనాలు పెంచి తన వాళ్లకు అప్పగించే ప్రయత్నాలు చేశారు.
'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation
రైతులు సొంత ఖర్చులతో పనులు: హంద్రీనీవా తొలిదశ డిస్ట్రిబ్యూటరీ కాలువలే పూర్తిచేయలేకపోయింది వైసీపీ సర్కార్. తొలిదశలో కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీలు నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలి. ఇందుకోసం 14 టీఎంసీల వరకు నీటిని వినియోగించాలి. కానీ జగన్ వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. శ్రీశైలం జలాశయంలో నిండుగా నీళ్లున్నా ఆయకట్టుకు అందించలేని విఫల సర్కారుగా మిగిలిపోయింది. ఉప, పిల్ల కాలువల్లో కంప చెట్లు పెరిగిపోయాయి. మట్టి పూడుకుపోయి తట్టెడు మట్టి ఎత్తిపోసింది లేదు. దీంతో రైతులు సొంత ఖర్చులతో ప్రధాన కాలువల వద్ద మోటార్లు పెట్టుకుని, పైపులు వేసుకుని, దూరంగా ఉన్న తమ పొలాలకు నీటిని పంపింగ్ చేసుకుంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కాలువను 553 కిలోమీటర్ల పొడవున తవ్వారు. ఈ కాలువ మీద ఉన్న శ్రీనివాసపురం, అడివిపల్లి జలాశయాల ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాలి. మేజర్ పనులు ఎప్పుడో పూర్తయినా జగన్ హయాంలో చిన్నచిన్న పనులనూ చేయకపోవడంతో చిత్తూరు జిల్లాలోని చివరి జలాశయానికి నీళ్లు చేరడం లేదు. ఈ జిల్లాలో పెండింగు పనుల పూర్తికి 75 కోట్లు విడుదల చేయాలని అధికారులు కోరినా ప్రభుత్వం ఇవ్వని కారణంగానే ఈ దుస్థితి నెలకొంది.
కోనసీమ వరి పొలాల్లో బైకులు నడిపిన రైతులు - Paddy Crop Damage
సినిమా సెట్టింగ్ రాజకీయాలు: ఐదేళ్లు కాలం గడిపిన సీఎం జగన్ ఎన్నికల ముంగిట అభినవ భగీరథుడిలా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్ల పేరిట సినిమా సెట్టింగ్ రాజకీయాలు చేశారు. గేట్లు ఎత్తిన కొన్ని గంటలకే కాలువ ఎండిపోగా సెట్టింగ్ ఎత్తేశారు. ఈ ప్రచార రాజకీయాల కోసం అనంతపురం జిల్లాకు సాగునీటిని అందించకుండా పంటలను ఎండబెట్టారు. వాస్తవానికి పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే పనులు చంద్రబాబు హయాంలో 2019 నాటికే సింహభాగం కొలిక్కి వచ్చాయి.
మిగిలినవి పూర్తి చేసి నీళ్లు అందించడం సులభమే అయినా మధ్యలో ఉన్న కొన్ని పనులు సరిగా చేయలేదు. శ్రీశైలంలో నీళ్లున్న రోజుల్లోనూ వాటిని ఆయకట్టుకు అందించలేకపోయారు. రాయలసీమలో అత్యధిక సీట్లు కట్టబెట్టినందుకు కృతజ్ఞత కూడా చూపని సీఎం జగన్ రైతులకు తీరని అన్యాయం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లందించే అవకాశం ఉన్నప్పటికీ పొలాలకు చేరకుండా చేశారు.