Irrigation Dept Clarifies on Handover of Projects to Krishna Board :విద్యుత్ కేంద్రాలు మినహాయించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన మిగిలిన ఔట్‌లెట్ల ద్వారా త్రిసభ్య కమిటి నిర్ణయం మేరకు నీటి విడుదల, నీటి నిర్వాహణ మాత్రమే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) బాధ్యత అని రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ధారాదత్తం చేసిందని, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టిందన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.
వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం - కృష్ణాబోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు
Irrigation Secretory on KRMB Issue :కేంద్ర జలశక్తి శాఖ సమావేశం మినట్స్ తప్పుగా వచ్చాయని, సవరణ కోరుతూ తాను లేఖ రాసినట్లు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. మొదట్నుంచీ ఉన్న వాదననే తాము వినిపిస్తున్నామని, ప్రాజెక్టులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని వివరించారు. అభ్యంతరాలు నివృత్తి చేస్తేనే ప్రాజెక్టులు అప్పగిస్తామన్న చెప్పామన్న ఆయన, నీళ్ల నియంత్రణ ఇప్పటికే కృష్ణా బోర్డు చేస్తోందని చెప్పారు.
నిన్న కృష్ణా బోర్డు ఛైర్మెన్‌తో సమావేశంలో ఈఎన్సీ అన్ని అంశాలను స్పష్టంగా చెప్పారని, షరతులు అంగీకరించకుండా స్వాధీనం చేయబోమని చెప్పినట్లు రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. స్వాధీనం చేస్తామని నీటిపారుదల శాఖ బడ్జెట్ పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. విభజన చట్టం ప్రకారం జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల(Nagarjuna Sagar) పరిధిలో మిగిలిన ఔట్ లెట్స్ అప్పగింతకు ప్రభుత్వం అనుమతి పొందాల్సిన అవసరం ఉందని ఈఎన్సీ సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. డ్యాంల నిర్వహణ మాత్రం ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందన్న నిర్ణయం జరిగిందని అన్నారు.