Irregularities in Tirupati in Master Plan roads: తిరుపతి నగరంలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దలకు ఆదాయవనరుగా మారాయి. రహదారుల నిర్మాణాల ముసుగులో అడ్డగోలుగా భూములు లాక్కొని టీడీఆర్ బాండ్ల పేరుతో కోట్ల రూపాయలు దిగమింగడంపై చూపిన శ్రద్ధ, భవిష్యత్ తరాలకు పనికి వచ్చేలా రహదారులు నిర్మించడంపై చూపలేదు. దీంతో మాస్టర్ ప్లాన్ రహదారులు నిధుల స్వాహాకు రూపొందించిన ప్రణాళికగా మారిపోయాయి.
రహదారుల నిర్మాణాల సమయంలో మురికికాలువలు ఏర్పాటు చేయాలన్న కనీస ప్రమాణాలు పాటించకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వ్యయం చేశారు. ఫలితంగా మురికినీరు, వర్షపునీరు ప్రవహించే దారిలేక మాస్టర్ ప్లాన్ రహదారులు, మురికి గుంటలుగా మిగిలిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల అవినీతి దాహానికి అద్దం పట్టేలా తిరుపతి నగర మాస్టర్ ప్లాన్ రహదారులు మారాయి.
తిరుపతి నగర బృహత్తర ప్రణాళిక (MASTER PLAN) రహదారుల నిర్మాణంలో వైఎస్సార్సీపీ నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తితోపాటు ఎన్నికల ముందు రాజకీయలబ్ధి కోసం అడ్డగోలుగా రహదారుల నిర్మాణాలు చేపట్టారు. భవిష్యత్తు అవసరాల ముసుగులో రహదారులు నిర్మించి కోట్ల రూపాయలు దిగమింగారు. మాస్టర్ ప్లాన్ రహదారులకు అనుసంధానంగా కాలువలు నిర్మించాలనే కనీస నిబంధనలను గాలికి వదిలేశారు. సాధారణంగా మాస్టర్ ప్లాన్ రహదారులు భవిష్యత్ జనాభా విస్తరణ సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్మిస్తారు.