NAALA Issue In GVMC:మహా విశాఖ నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక అధికారులు ఖాళీ స్థలాలకు పన్ను లేకుండా ప్లాన్లు మంజూరు చేసి, భవనాలు నిర్మించడానికి సహకరిస్తున్నారు. ఈ విషయాలు ఇటీవల ఒక్కొకటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా నాలా పన్ను చెల్లించకుండానే ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) పత్రాలు జారీ చేసిన ఉదంతాలు సైతం వెలుగు చూస్తున్నాయి.
నాలా బిల్లులో అక్రమాలు:నాలాకు బిల్లులు చెల్లించకుండా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలు గాజువాక, పెందుర్తి, భీమిలి, చినగదిలి రూరల్ మండలాల పరిధిలో ఉన్నాయి. దీని ఫలితంగా రూ.120 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. విచిత్రమేమంటే అక్రమాలకు పాల్పడిన ప్రణాళిక, రెవెన్యూ అధికారులు కీలకమైన పోస్టింగుల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు.
కూర్మన్నపాలెంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఎంవీవీ అండ్ ఎంకే హౌసింగ్ ప్రాజెక్టులోనూ పన్ను చెల్లించలేదు. సర్వే నెంబరు 58/3, 59, 52/5సి, 59/1బి, 60/1, 60/6 మొత్తం 9.50 ఎకరాల విస్తీర్ణంలో స్టిల్ట్, గ్రౌండ్ ప్లస్-9 భారీ అపార్టుమెంట్లు నిర్మించారు. ప్లాను కోసం 2018లో దరఖాస్తు చేశారు. అప్పటి కమిషనర్ హరినారాయణన్, ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ఆర్ విద్యుల్లత, నగర ప్రణాళికాధికారి బి.సురేశ్‌కుమార్ ప్లానను మంజూరు చేస్తూ, నాలా (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అసెస్‌మెంట్) పన్ను నిధులు (భూమి విలువలో 2 శాతం నిధులు) చెల్లించాలని షార్ట్ ఫాల్స్‌లో పేర్కొన్నారు.
సుమారు రూ.5 కోట్లు నాలా పన్ను ప్రభుత్వానికి చెల్లించి, ఆ రసీదును ఆన్‌లైన్‌లో భద్రపరచాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించకుండానే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, జీవీఎంసీ అధికారులు ఓసీ విడుదల చేయడం గమనార్హం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, టీడీపీ 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం కౌన్సిల్ సమావేశంలో మేయరు, గత కలెక్టర్ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. గతంలో అధికారుల అండతో ఎంవీవీ ఆయా ఫిర్యాదులను తొక్కిపట్టారు.