Hyderabad News Today:ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నిక గన్న హైదరాబాద్ బిర్యానీ నాణ్యతపై క్రమక్రమంగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హోటళ్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, నాసిరకం సరుకుల వినియోగం వల్ల బిర్యానీలో క్వాలిటీ తగ్గుతోంది. హైదరాబాద్‌లోని హోటళ్లలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ, ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కుళ్లిపోయిన, పాచిపట్టిన మాంసం నిల్వలు దర్శనం ఇచ్చాయి. తాజాగా ఓ హోటల్ బిర్యానిలో ఇనుప పీచు ముక్కలు దర్శనమివ్వడంతో నిలదీసిన కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడికి పాల్పడింది.
ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్క్కి చెందిన బేగరి శంకర్, మహేంద్, నాగరాజు, సురేశ్, మరో ఇద్దరితో కలిసి ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు బిర్యాని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ బిర్యానీలో బాసన్లు తోమే సబ్బుకు ఉపయోగించే ఇనుప పీచు ముక్కలు రావడాన్ని గుర్తించిన కస్టమర్లు నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. దానికి బదులుగా వేరే అన్నం ఇస్తామని చెప్పి అప్పటికీ సరైన ఆహారం ఇవ్వకపోవటంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో హోటల్ నిర్వాహకులు కస్టమర్లపై దాడిచేశారు. ఈ దాడిలో నలుగురు గాయుడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.