AP CID EX Chief Sanjay Irregularities :వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలకు కొమ్ముకాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పని చేసిన ఆయన డొల్ల కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఒకే సంస్థను రెండు వేర్వేరు సంస్థలుగా చూపి డొల్ల కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి వారంలో ఏ పనులు చేయకుండానే కోటిన్నర బిల్లులు చెల్లించేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో డొల్ల కంపెనీల గుట్టు బయటపడింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ డొల్ల కంపెనీలకు బిల్లులు చెల్లించారని విజిలెన్స్ విచారణలో తేలింది. 2022 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ ఈ ఏడాది జనవరిలో అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణకు టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పణకు కేవలం 3 సంస్థలకే అవకాశం కల్పించారు. సౌత్రికా టెక్నాలజీస్, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌తో పాటు మరో సంస్థ ఈ టెండర్లలో పాల్గొంది. లోయస్ట్ బిడ్డర్ కాకపోయినప్పటికీ సౌత్రికా టెక్నాలజీస్‌ను ఎల్-1గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఫిబ్రవరి 15న ఒప్పందం చేసుకున్నారు. ఎలాంటి పనులు జరగకుండా వారం రోజుల్లోనే 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. సగానికిపైగా పనులు పూర్తయిపోయాయని, మరో 26 లక్షలు బిల్లులివ్వాలని ఆ సంస్థ క్లెయిమ్ చేయగా ఆ మొత్తమూ చెల్లించేందుకు సిద్ధమయ్యారు. టెండర్లు, కాంపిటేటివ్ బిడ్లు లేకుండా ఒక్కోటి 1.78లక్షల చొప్పున 10 ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లను సౌత్రికా టెక్నాలజీస్ నుంచే కొన్నారు. ఇందుకు 17.89 లక్షలు చెల్లించారు.
నిబంధనలకు నీళ్లు - 'అగ్ని'లో అవినీతి!
2024 జనవరిలో సీఐడీ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారు. దీనిలోనూ సౌత్రికా టెక్నాలజీస్, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌తో పాటు మరో సంస్థ పాల్గొంది. క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను ఎల్-1గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు 59.52 లక్షలు, ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు 59.51 లక్షల చొప్పున మొత్తం1.19 కోట్లు చెల్లించేశారు. సదస్సుల నిర్వహణ మొత్తం క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ చేపట్టాల్సి ఉన్నా సీఐడీ అధికారులే వాటిని నిర్వహించారు. అదీ 3.10 లక్షలే ఖర్చు చేశారు. క్రిత్వ్యాప్ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల చెల్లింపు పేరిట 1.15 కోట్లు దోచేశారు.
క్రిత్వ్యాప్, సౌత్రికా టెక్నాలజీస్ సంస్థలు ఎక్కడున్నాయని విజిలెన్స్ విచారణ చేపట్టగా అసలు క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డొల్ల కంపెనీ అని తేలింది. ఆ సంస్థ చిరునామాగా పేర్కొన్న ఫ్లాట్ నంబర్ 601,ఆరో ఫ్లోర్, లలితాంజలి అపార్ట్‌మెంట్, ద్వారకాపురి కాలనీ, హైదరాబాద్ వెళ్లి విజిలెన్స్ అధికారులు పరిశీలించగా ఆ సంస్థే లేదని తేలింది. అదే చిరునామాలో సౌత్రిక టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతున్నట్లు గుర్తించారు. క్రిత్వ్యాప్ టెక్నాలజీస్, సౌత్రిక టెక్నాలజీస్ రెండూ ఒకే సంస్థలని వాటిలో ఒకటి డొల్ల కంపెనీ అని నిర్ధారించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రిత్వ్యాప్, సౌత్రికా టెక్నాలజీస్ సంస్థలకు చెల్లించిన సొమ్ము అంతిమంగా ఎవరి వద్దకు చేరిందో సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై సీఐడీ లేదా ఏసీబీతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు
దేశం దాటుతున్నCID Chief సంజయ్ -భయపడి పారిపోతున్నాడంటూ ట్రోలింగ్ - AP CID Chief sanjay on leave