Investigation Speeded up Madanapalle Sub Collector Office Case : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి పోలీసులు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మదనపల్లిలో గతంలో ఆర్డీవోగా పనిచేసిన మురళి, బదిలీ అయిన హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌లను పోలీసులు వరుసగా మూడో రోజు విచారిస్తున్నారు.
మదనపల్లె అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు - విచారణలో విస్తుపోయే నిజాలు - Madanapalle Fire Accident
మదనపల్లెకు చేరుకున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్ :ఈరోజు ఉదయం అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగితే ఎవరు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చినప్పుడు కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారని దానిపై ఆరా తీశారు. కాగా ఈ ఘటనకు ప్రాథమిక విచారణలో బాధ్యులుగా తెలిన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
పలువురు అధికారులపై వేటు :మదనపల్లి వన్ టౌన్ సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసిన తెల్లవారే వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సీఐను వీఆర్‌కు పంపారు. ఆయనతోపాటు నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు హరిప్రసాద్, భాస్కర్ ను కూడా సస్పెండ్ చేశారు. ఈ ఘననపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి అధికార బృందం చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవి రెడ్డి ఈ ఘటనలో కీలక పాత్రధారిగా భావిస్తూ ఆయన కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.