Investigating Officer Questioned to TDP Leader B Tech Ravi : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని చైతన్యరెడ్డి కడప జైలులో బెదిరించిన కేసులో విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా టీడీపీ నేత బీటెక్ రవిని ఆన్‌లైన్ ద్వారా విచారణ అధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. గతంలో కడప జైల్లో దస్తగిరి, బీటెక్ రవి ఎదురెదురు బ్యారక్స్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవిని విచారించారు.
దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్యరెడ్డి వెళ్లాడా? లేదా? అని ప్రశ్నించారు. దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్యరెడ్డి వెళ్లడం తాను చూశానని సదరు అధికారికి రవి తెలిపారు. చైతన్య రెడ్డి రావడంపై ఆ రోజు జైలు సిబ్బందిని ప్రశ్నించానన్నారు. ఈ మేరకు బీటెక్ రవికి రాహుల్ శ్రీరామ్ ఆన్‌లైన్‌లో పలు ప్రశ్నలను పంపి సమాధానాలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, జైలు సిబ్బందిని ప్రశ్నించారు.
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం : అయితే వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఫిర్యాదుతో కడప జైలులో బెదిరించటం, ప్రలోభపెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించింది. విచారణలో భాగంగా ఈనెల 7వ తేదీన కడప జైలులో దస్తగిరిని విచారణ అధికారి ప్రశ్నించారు. మరుసటి రోజు డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్‌ను విచారించారు.