Family Survey in MP Asaduddin Owaisi House : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. సర్వేలో భాగంగా ఇవాళ నగరంలోని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. శాస్త్రీపురంలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటికెళ్లిన అధికారులు, ఆయనను కలిసి వారి కుటుంబ సభ్యలు వివరాలతో పాటు ఇతర వివరాలు సేకరించారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ప్రశ్నలకు ఆయన సహకరించి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించి, వివరాలు ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఇంట్లో సమగ్ర కుటుంబ సర్వే : సర్వేలో భాగంగా నవంబర్ 28న జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఇతర అధికారులతోపాటు ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం సర్వే చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు.
వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు.