Dissension in YSRCP: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు - చేర్పులతో స్థానిక నేతల్లో ఆగ్రహం నెలకొంది. ఇది అసమ్మతిగా మారి పార్టీలో అలజడిని సృష్టిస్తోంది. తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామంటూ కొందరు నేతలు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి సేవ చేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. ఎప్పట్నుంచో నమ్ముకున్న స్థానిక నేతకు టిక్కెట్టు ఇవ్వకుండా, ప్రతిపక్షాలను దూషించిన వారికే టిక్కట్లు ఇస్తామనడం సరికాదని నేతలు వాపోతున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ సీట్ల కుంపటి తారస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్‌ను కాదని కొత్త ఇన్‌ఛార్జిగా దద్దాల నారాయణను అధిష్ఠానం నియమించింది. దీంతో పార్టీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్ యాదవ్‌కు మద్దతుగా పదవులకు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన మధుసూదన్ యాదవ్‌కు సీటు ఇవ్వకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీట్ల మార్పుపై వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం - కార్యకర్తలను కరివేపాకులా తీసివేస్తున్నారని అసహనం
"జగనన్నా ఏది ఆదేశిస్తే అదే పని చేసుకుంటూ వస్తున్నాము. కనిగిరి మున్సిపాలిటీలో 20 వార్డులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. దానికి మూల కారణం ఎమ్మెల్యే కృషి" - సుజాత, మున్సిపల్ కౌన్సిలర్, కనిగిరి
"గెలిచే గుర్రాన్ని పంపిస్తే మేము కూడా గుర్రాన్ని పరిగెత్తించగలం. కానీ, గెలిచేవారిని కాకుండా ఇష్టానుసారం ఎవర్ని పడితే వారిని పంపిస్తే ఏం చేయగలం." - వెంకటేశ్వర్లు, ఎంపీపీ,