Weather Temperature in Telangana :రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు.మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది.
ఎల్లుండి రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయని, బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వరంగల్, వనపర్తిలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు : మరికొన్ని రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొనే అవకాశముంది. ఒక వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా మరో వైపు రాష్టంలో పలు జిల్లాలో వారం క్రితం పడిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.