గగనతల గస్తీకి సిద్ధమైన ఫ్లయింగ్ క్యాడెట్లు - శిక్షణ పూర్తిచేసుకున్న 235మంది వాయు సైన్యం (ETV Bharat) Indian Air Force Cadets Passing Out Parade :హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వీ ఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ఫ్లైట్ క్యాడెట్లు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. 235 ఫ్లయింగ్ క్యాడెట్లు శిక్షణ పూర్తయిన తర్వాత తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. 235 మందిలో 22 మంది మహిళా అధికారులు, భారత నేవీ దళానికి చెందిన వారు 9 మంది, మరో 9 మంది కోస్ట్‌గార్డు విభాగానికి చెందిన వారు కాగా, మరో 25 మంది జాతీయ డిఫెన్స్ అకాడమీకి చెందిన వారున్నారు.
అద్భుతంగా సాగిన ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన :ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వీరికి శిక్షణ ఇచ్చారు. క్యాడెట్లు కవాతు ప్రదర్శన అనంతరం వారితో అకాడమీ కమాండెంట్ ప్రమాణం చేయించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్‌లకు ఎయిర్ చీఫ్ మార్షల్ జనరల్ చౌదరి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
భారత వైమానిక దళంలోని వివిధ శాఖల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారు అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. నేవీ, వాయూ, మిలటరీ ఏ విభాగంలోనైనా క్రమ శిక్షణతో రాణించాలని ఆయన అన్నారు. నాయకత్వ లక్షణాలతో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందించిందన్నారు.
IAF Combined Graduation Parade in Hyderabad : విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అకాడమీ వృత్తిపరమైన నైపుణ్యాలను అందించిందన్నారు. ఆధునిక యుద్ధంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎయిర్ చీఫ్ మార్షల్ సూచించారు. యువ నాయకులుగా యుద్ధాలను గెలవడానికి సాంకేతికతను సమర్థవంతంగా స్వీకరించాలన్నారు. కవాతు ప్రదర్శన అనంతరం ఫ్లయింగ్ క్యాడెట్లు తమ ఆనందాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కలిసి పంచుకున్నారు.