తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే వారికి అలర్ట్​ - ఆ ప్రాంతం గుండా వెళితే కాస్త జాగ్రత్త! - THEFTS IN THE NALGONDA HIGHWAY

నల్గొండ జాతీయ రహదారిపై పెరుగుతున్న దొంగతనాలు - హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సులే టార్గెట్​ - రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు

Increasing Thefts in the Nalgonda National Highway
Increasing Thefts in the Nalgonda National Highway (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 10:27 AM IST

Increasing Thefts in the Nalgonda National Highway :గత కొంతకాలంగా నల్గొండ జిల్లా జాతీయ రహదారి నార్కట్​పల్లి - చిట్యాల మధ్యలో ఉన్న హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. బస్సుల్లో ప్రయాణం చేస్తూ పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకెళ్తున్న వారిపై ముందుగా కన్నేస్తారు. బస్సు ఆగిన తర్వాత వారితో పాటే ఒకరిద్దరు అల్పాహారం, టీ కోసం దిగుతారు. హోటల్లో వారి కదలికలను గమనించి బస్సులో ఉన్నవారికి సమాచారం ఇస్తారు. అలా చెప్పగానే బ్యాగులో ఉన్న నగదు, బంగారం దోచుకుని మిగిలిన దుండగులు బస్సు దిగి వెళ్లిపోతారు.

ఇలాంటి ఘటనలు తరచూ ఒకే ప్రాంతంలో జరగడం, ఆ తర్వాత బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత బాధితులు నగదు ఇప్పించాలంటూ స్టేషన్‌కు రాకపోవడం, నిర్లక్ష్యంగా వదిలేయడం వంటివి పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే ప్రాంతంలో జరిగిన మూడు కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని దాబాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులు అడ్డాగా మార్చుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై పెట్రోలింగ్, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో కేసులను ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

  • 2020 జూన్‌లో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కొత్త కారు కొనేందుకు రూ.10 లక్షలు డబ్బు ఉన్న బ్యాగుతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఎక్కాడు. అతను డబ్బు ఉన్న బ్యాగును బస్సులో ఉంచి కిందికి దిగాడు. అనంతరం వెళ్లి చూడగా బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది.
  • 2022 జనవరిలో చెన్నై రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. 1,300 గ్రాముల బంగారం గొలుసు (దీని విలువ సుమారు అప్పుడు రూ.68 లక్షలు) బ్యాగును ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో ఉంచి కిందకి దిగాడు. అనంతరం బస్సులోకి వచ్చి చూడగా, బంగారం ఉన్న బ్యాగు కనిపించలేదు. ప్రస్తుతం ఈ కేసు కూడా పెండింగ్‌లోనే ఉంది.
  • తాజాగా ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్లకు చెందిన వెంకటేష్‌ రూ.25 లక్షల నగదును తీసుకొని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సును ఎక్కాడు. నార్కట్‌పల్లి గ్రామ శివారులోని ఓ హోటల్‌ వద్దకు రాగానే నగదు ఉన్న బ్యాగును అక్కడే పెట్టి టిఫిన్‌ తినేందుకు వెళ్లాడు. అనంతరం వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నగదును బ్యాగులో పెట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు :నార్కట్‌పల్లి ప్రాంతంలో నాలుగు పెద్ద మొత్తంలో దొంగతనాలు జరిగిన విషయం వాస్తవమేనని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. ఎస్పీ ఆదేశాలతో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కలిపి నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు నగదును బ్యాగులో పెట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. అన్ని కేసులపై వాస్తవాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

టిఫిన్ చేసి వచ్చేలోపు రూ.23 లక్షలు మాయం - ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు​లో చోరీ

అర్ధరాత్రి ఇంట్లోకి దొంగతనానికి వచ్చారు - అమెరికాలో ఉంటున్న యజమాని షాక్ ఇచ్చాడు

ABOUT THE AUTHOR

...view details