తెలంగాణ

telangana

ఉపాధికి రాచబాట- విద్యార్థులకు వరంగా మారిన ఐటీఐ కోర్సులు - employment through ITI course

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 7:07 PM IST

Employment through ITI Course : తక్కువ సమయంలోనే ఎక్కువ నైపుణ్యాలు పొంది, విద్యార్థులు జీవితంలో ఎదగడానికి దోహదపడుతున్నాయి వృత్తి విద్యా కోర్సులు. పరిశ్రమలు మెండుగా ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులకు ఇది మరింత తీపికబురు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వివిధ ట్రేడుల్లో శిక్షణనిచ్చి వారు భవిష్యత్తుకు సోపానమార్గాలుగా మారుతున్నాయి. ఈ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లోనే కాకుండా స్వతహాగా, స్వశక్తితో జీవించడానికి మార్గం సుగమం చేస్తున్నాయి.

Employment Opportunities in ITI
Employment through ITI Course (ETV Bharat)

Employment Opportunities in ITI : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఐటీఐ కోర్సుల ద్వారా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ లను ఏర్పాటు చేసింది. ఇది విద్యార్థుల పాలిట వరమవుతోంది. ఐటీఐ కోర్సు పూర్తికాగానే ఆప్రెంటీస్‌ చేస్తున్నారు. ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం - TGSRTC ITI COURSE ADMISSION 2024

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కలిపి మెుత్తం 35 ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో 13 ట్రేడులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో పటాన్‌చెరు, జిన్నారం, హత్నూర, సదాశివపేట, మల్లేపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. సిద్దిపేట, మెదక్‌ జిల్లాలోనూ పరిశ్రమల సంఖ్య ప్రతిఎడాది పెరుగుతోంది. పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ఐటీఐ పూర్తి చేసిన నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ కోర్సులు ఉపాధి బాటలు పరుస్తున్నాయి. ఐటీఐ, అప్రెంటీస్‌ పూర్తి చేయగానే కాంట్రాక్టు పద్దతిలో కాకుండా పరిశ్రమ తరఫున నేరుగా అవకాశాలు కల్పిస్తున్నారు. దీనివల్ల వారు కొద్దికాలంలోనే నెలకు దాదాపు 20 వేల రూపాయలకు పైగా వేతనాన్ని అందుకుంటున్నారు. కాబట్టి ఈ ఐటీఐ కోర్సులను ఎంచుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.

ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లోనూ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ చాటిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ ద్వితీయసంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. తద్వారా నచ్చిన డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉజ్వల భవితకు బాటలు వేసుకోవచ్చు. ఇది ఒక చక్కటి అవకాశం. నేరుగా ఉద్యోగం పొందాలి అనుకున్న వారికి ప్రాంగణ ఎంపికల ద్వారా ప్రయివేటు రంగ సంస్థలు నేరుగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

సంగారెడ్డి ఐటీఐ కళాశాలలో ఎక్కడా లేని విధంగా అన్ని ప్రాక్టికల్స్‌ నేరుగా విద్యార్థులతోనే చేయిస్తున్నారు. చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద యంత్రాల వరకు విద్యార్థులే చేయగలిగేంత సామర్థ్యాన్ని వారికి నేర్పుతున్నారు. ప్రాక్టికల్స్‌లో మంచిగా నేర్చుకోవడంతో సొంతంగా వ్యాపారం కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

ఐటీఐ కోర్సును పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ రాజేశ్వరరావు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ, విద్యార్థులకు ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

టెక్నికల్​ కోర్సుల్లో చేరండి - తక్కువకాలంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందండి! - Technical Courses After 12th

ITI అర్హతతో - రైల్వేలో 1010 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Apprentice Posts 2024

ABOUT THE AUTHOR

...view details