Farmers Facing Problems Due To No Rains in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలకరి వానలు కురవగానే పొలాల్ని దున్ని విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలకరి వానలు జూన్ ప్రారంభంలోనే పలకరించాయి. పంటలు సాగు చేసుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపారు. 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సైతం అంచనా వేశారు. కానీ మొదట్లో కురిసి, ఆ తర్వాత వానలు లేకుండా పోవడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
చాలా చోట్ల వేసిన విత్తనాలకు సరిపడా తడి అందకపోవడంతో అవి మొలకెత్తడం లేదు. మొలకెత్తిన చోట వానల్లేక మొలకలు వాడిపోతుతున్నాయి. కొందరు మళ్లీ విత్తనాలు నాటినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో రైతులు వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారం పాటు ఇవే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంట వైపు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.
వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతంగా పొలం ఉన్న వారు ఇప్పటిదాకా ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలుకు తీసుకున్న రైతులు కౌలుతో పాటు పెట్టుబడినీ కోల్పోతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దామన్నా, తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వానల్లేకుంటే అవి కూడా మొలకెత్తుతాయన్న నమ్మకం లేదు. అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వానజాడ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
బోరు నీళ్లతో పంటలను కాపాడుకుంటూ : వాన జాడ లేకపోవడంతో వేసిన పంటల్ని రక్షించుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. వానల్లేక భూగర్భ జలాలూ అడుగంటాయి. బోర్లు అక్కడక్కడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఉన్న బోరునీళ్లతో సగం పంటనైనా కాపాడుకునేందుకు పైపులు కొనుగోలు చేసి తుంపర సేద్యం ద్వారా కొందరు నీళ్లందిస్తున్నారు. పంటను వేసేందుకు పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తైతే, దానికి నీళ్లందించి కాపాడుకునేందుకు అవుతున్న ఖర్చు మరో ఎత్తని రైతులు వాపోతున్నారు.