Illegal Sand Mining in Krishna River at Papavinasanam: పాపవినాశనం వద్ద కృష్ణానదిలో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు కొన్నాళ్లుగా నిత్యకృత్యమైంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు పొక్లెయినర్లతో కృష్ణానదిని(krishna River) తవ్వేస్తూ కృష్ణమ్మకు కడుపుకోతను మిగులుస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాలను సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉదాసీన వైఖరి అవలంబించడంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేనప్పటికీ అడ్డగోలుగా జరిగే అక్రమ త్రవ్వకాలను అడ్డుకునే నాథుడు లేకపోవడం గమనార్హం. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, గ్రామస్థులు అధికారుల దృష్టికి వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ ఫలితం శూన్యంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
సంయుక్త కమిటీ పర్యవేక్షణలోనే కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు
కృష్ణానదిలో సుమారు 5 మీటర్ల లోతుగా ఇసుక తవ్వకాలు జరపడం వలన భూగర్బజలాలు అడుగంటి పోతున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు వల్ల బోరు వేసినా నీరు రాకపోవడంతో కొందరు రైతులు పంటలు సాగు చేయలేక భూములు వదిలి వేస్తున్నారని స్థానికులు వెల్లడించారు. జీసీకేసీ ప్రాజెక్ట్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (gckc project and works pvt ltd) అనే పేరుతో బిల్లులు ఇస్తూ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరిపి పెద్ద పెద్ద టిప్పర్లు, లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. భారీ ఇసుక లోడుతో టిప్పర్లు కృష్ణానది కరకట్టపై నుండి వెళ్లటం వల్ల కరకట్ట గోతుల మయంగా మారింది. దీంతో కరకట్ట రోడ్డుపై పగుళ్లు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు.