ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్​ లాటరీ - వాట్సాప్​లో టికెట్లు - పేదల ఆశే మాఫియాకి పెట్టుబడి - Illegal Lottery Tickets Sale - ILLEGAL LOTTERY TICKETS SALE

Illegal Lottery Tickets Sale : లాటరీ ఈ పేరు వినగానే సామాన్యుల్లో ఆశలు రేకేత్తిస్తాయి. ఒక టికెట్​కు జాక్​పాట్ తగిలినా అదృష్టం మారిపోతుందనే భావన వారిలో ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకోని అంతర్జాలం వేదికగా లాటరీ మాఫియా రెచ్చిపోతోంది. వాట్సప్​లో టికెట్లను విక్రయిస్తూ ఆన్​లైన్​లో చెల్లింపులు చేస్తున్నారు. ఈ తంతగం చిత్తూరు జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

Illegal Lottery Tickets Sale
Illegal Lottery Tickets Sale (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 12:14 PM IST

Lottery Tickets Sale Frauds : 'రండి బాబు రండి లాటరీ టికెట్లు కొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి' అనే కాలం పోయింది. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. సెల్​ఫోన్​ చేతబట్టుకుని టీ దుకాణాలు, కేఫ్‌లలో దర్జాగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్నారు. అనుమానం రాకుండా వాట్సప్‌లోనే టికెట్ల నంబర్లు పంపుతున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుగుతున్నాయి. పోలీసులున్నారని కేసులు నమోదు చేస్తారనే భయం లేకుండా దందా సాగుతోంది. పేదల అత్యాశను ఆసరా చేసుకొని నిలువునా దోచుకుంటున్నారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు నగరం చిత్తూరులో లాటరీ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. గత సర్కార్​లో ఇబ్బడి ముబ్బడిగా ఈ వ్యవహారం సాగింది. కాస్తా వేగం తగ్గినా దందా మాత్రం అదే స్థాయిలో జరుగుతోంది. అప్పుడు టికెట్ల రూపంలో జరుగుతున్న వ్యాపారం కాస్తా రూటు మార్చుకుని వాట్సప్‌కి చేరింది. గొలుసుకట్టు తరహాలో యథేచ్ఛగా సాగుతోంది.

పేదలు, మధ్యతరగతి వర్గాలే లక్ష్యం : మాదక ద్రవ్యాలకే కాకుండా లాటరీ టికెట్లకు కొందరు బానిసలుగా మారుతున్నారు. ఒక్కో సంస్థకు చెందిన టికెట్లు రోజులో రెండు, మూడు పర్యాయాలు ఫలితాలు విడుదల చేస్తుండటం, టికెట్లు విక్రయిస్తుండటంతో ప్రజలు విధిగా కొనుగోలు చేస్తున్నారు. రోజువారి కూలీలు, వ్యాపారులు, యువత, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు లక్ష్యంగా కనీసం రూ.100- రూ.5000 వెచ్చిస్తూ నష్టపోతున్నారు. కొంత మంది సంపాదనలో సగం టికెట్లకే వెచ్చించి నిలువునా మోసపోతున్నారు.

సామాజిక మాధ్యమాలే వేదిక :లాటరీ టికెట్లన్నీ ప్రస్తుతం వాట్సప్‌లోనే విక్రయిస్తున్నారు. గతంలో అధికారిక లాటరీ టికెట్లు దొంగచాటున చిత్తూరు వచ్చేవి. పోలీసులు తనిఖీలు చేపట్టడంతో అవి ఆగిపోయాయి. ఆపై మహారాష్ట్ర, కేరళ, మణిపూర్​, బంగాల్​ ఇతర ప్రాంతాల నుంచి అంకెలు మాత్రమే వస్తుంటే వాటిని రంగు కాగితాల్లో స్థానికంగానే ముద్రిస్తూ వచ్చారు. వాటి ముసుగులో కేటుగాళ్లు దొంగ టికెట్లను సైతం ముద్రించి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. ఆపై కాగితాల్లో అంకెలు రాసిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల నిఘా ఉండటంతో వాట్సప్​లో నంబర్లు పంపుతూ దందా చేస్తున్నారు. అక్రమార్కులకు పోలీసు శాఖలో కొంత మంది సహకారం ఉండటంతో వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు విమర్శలున్నాయి.

వాడవాడలా ఏజెంట్లు : చిత్తూరు నగరంలో లాటరీ టికెట్ల విక్రయాల కోసం వాడవాడలా ఏజెంట్లు ఉన్నారు. గతంలో సుమారు 24 ప్రాంతాల్లో విక్రయాలు సాగాయి. ప్రభుత్వం మారడం, నేతలతో పొత్తు కుదరకపోవడం, పోలీసుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో విక్రయాలు ఆగినా, మిగిలిన ప్రాంతాల్లో సాగుతోంది. గొలుసుకట్టు తరహాలో ఒకరు మరో ఇద్దరిని ,ఆ ఇద్దరు మరో నలుగురిని ఇలా ఈ తంతు యథేచ్ఛగా జరుగుతోంది. గతంలో మాదిరిగా దుకాణాల్లో కూర్చుని వ్యాపారం చేయకపోయినా ఆన్​లైన్​ వేదికగా వివిధ ప్రాంతాల నుంచే తమ దందా నిర్వహిస్తున్నారు.

ఎంతటివారైనా సహించం :లాటరీ టికెట్ల క్రయవిక్రయాలు అనుమతించమని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. వాటిని నడిపించే వారు ఎంతటివారైనా సహించమనని చెప్పారు. ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యాపారం చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదులు అందినా సంబంధిత వ్యక్తులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని సాయినాథ్ హెచ్చరించారు.

దుబాయ్‌లో​ భారతీయుడిని వరించిన రూ.2.25కోట్ల జాక్‌పాట్

వ్యాపారికి జాక్​పాట్- లాటరీలో రూ.796 కోట్లు- విజయ రహస్యం ఇదేనట!

ABOUT THE AUTHOR

...view details