Illegal collection Of Mee Seva Centers In Jangaon: జనగామ జిల్లాలోని కొన్ని మీసేవా కేంద్రాలు అక్రమ దందాకు అడ్డాగా మారాయి. కేంద్రాల నిర్వాహకులు దళారులతో చేతులు కలిపి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ సేవలకు అధిక రుసుములు వసూలు చేస్తున్నారు. ఇలా చేసే మీసేవ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చూసి చూడనట్లుగా ఉంటున్నారు.
నిబంధనలు పాటించకుండా : మీసేవ కేంద్రాల నిర్వాహకులు వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర రశీదు మీద ఉన్న ధర కంటే ఎక్కవ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇతర వినియోగదారుల పనులను పక్కన పెట్టి దళారుల పనులను ముందుగా చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర, కేంద్ర పధకాల్లోని ఆసరాగా తీసుకొని ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
దళారులతో మీసేవ నిర్వాహకులు :రవాణాశాఖకు సంబంధించిన స్లాట్లు, లైసెన్స్‌లు, బీమా తదితర పనుల్లో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దళారులతో కుమ్మక్కైయ్యారు. లేబర్‌కార్డు కోసం దరఖాస్తుల నుంచి ఒక్కో కార్డుకు రూ.600పైగా వసూలు చేస్తున్నారు. లేబర్ కార్డుదారుల క్లెయిమ్స్లోనూ రూ.5వేల నుంచి 10వేల వరకు తీసుకుంటున్నారు. రేషన్‌కార్డు ఉంటే చాలు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి బయోమెట్రిక్ తీసుకొని లేబర్కార్డుకు దరఖాస్తు చేస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డులో పేరు, చిరునామా మార్చేందుకు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. గురకులాల్లో ప్రవేశాలకు కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలు త్వరగా ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేస్తున్నారు.