IIT Teams Visit Amaravati : రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి చేరుకున్నారు. టీడీపీ సర్కార్‌లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వీటిని ఆపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.
AP Capital Amaravati Structures Status :ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాసు, ఐఐటీ హైదరాబాద్‌లకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత , ఇతర సాంకేతిక అంశాలను ఐఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్లు సుబ్రమణ్యం, మున్వర్‌బాషా మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదికిస్తామని తెలిపారు. నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత, సామగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదికిస్తామని వారు వెల్లడించారు. అనంతరం సీఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సీఆర్డీఏ ముందుకు సాగనుంది.