Iconic Bridge on krishna River in Srisailam :హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల జాతీయ రహదారి ఎన్నెన్నో అందాలకు నెలవు. పూర్తిగా నల్లమల అడవి మీదుగా సాగే ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే పెద్ద పులుల అభయారణ్యాలు మధ్యలో కృష్ణా నది దానికిరువైపులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దులో ఘాట్‌రోడ్లు. అద్భుతమైన శ్రీశైలం డ్యాం అటువైపు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. మరో వైపు ఆక్టోపస్, ఫర్హాబాద్ వ్యూపాయింట్లు, టైగర్ సఫారీ, సలేశ్వరం, ఉమామహేశ్వర ఆలయాలు పర్యాటకుల మనసు దోస్తాయి. ఈ జాబితాలో ఐకానిక్ వంతెన సైతం చేరనుంది.
ప్రకృతి పర్యాటక ఆకర్షణ హైదరాబాద్-శ్రీశైలం జాతీయ :రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ విస్తరణంలో భాగంగా తెలంగాణలోని మన్ననూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వరకు చేపట్టే ప్రతిపాదిత నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌లో కృష్ణా నది ప్రాంతం కీలకం కానుంది. ఆనకట్ట దిగువన నదిని దాటేచోట నాలుగు వరుసలతో ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే శ్రీశైలానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశముంది.
670 మీటర్ల మేర ఐకానిక్ వంతెన :శ్రీశైలం వెళ్లే ప్రస్తుత రోడ్డు మార్గంలో ఈగలపెంట మీదుగా పాతాలగంగ దాటాక కృష్ణా నదిపై వంతెన ఉంది. దాన్ని దాటితే ఆంధ్రప్రదేశ్ పరిధి. అయితే నదికి ఇరువైపులా ఎత్తైన కొండల పైనుంచి కింది వరకు అనేక మలుపులతో ఘాట్ రోడ్డు ఉంటుంది. నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్లీ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుతుంది. ఈ మార్గంలో అధిక దూరం, సమయం ప్రయాణించాల్సి వస్తుంది.
ఈ ప్రయాసలను తప్పించేలా కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని ప్రతిపాదించారు. నదిపై ప్రస్తుత రోడ్డుకు, శ్రీశైలం డ్యాంకు మధ్యలో వంతెన ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. కృష్ణా మీదున్న ప్రస్తుత రోడ్డును విస్తరించకుండా ‘బైపాస్’గా కొత్తమార్గాన్ని డిజైన్ చేశారు. ఈ వంతెన గరిష్ఠ ఎత్తు 173 మీటర్లు ఉంటుంది. నది మీదుగా సాగే ఎలివేటెడ్ కారిడార్ సున్నిపెంట అవతలి వరకు దాదాపు శ్రీశైలం వరకు సాగుతుంది.