Hydra On Lake View Apartments In Hyderabad: ఒకప్పుడు లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లకు నగరంలో భలే గిరాకీ ఉండేది. చెరువు పక్కన కొత్త ప్రాజెక్టులు కడితే చాలు కొనుగోలుదారులు వరుస కట్టేవారు. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడం కోసం నిర్మాణ సంస్థలు కూడా లేక్ వ్యూ పేరుతో ప్రాజెక్టును ప్రచారం చేసుకునేవి. ఇప్పుడు హైడ్రా రావడం వల్ల పరిస్థితి మారింది. జలవనరుల ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆలోచిస్తున్నారు.
హైడ్రా విచారణ :జలవనరుల వద్ద నిర్మిస్తోన్న అపార్ట్‌మెంట్లు, భారీ ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉందా అనే విషయమై హైడ్రా విచారణ ప్రారంభించింది. జాబితాలో సాధారణ ప్రాజెక్టులతో పాటు బడా నిర్మాణ సంస్థలకు చెందిన ‘లేక్ వ్యూ’ ప్రాజెక్టులు ఉన్నాయి. రెండు నుంచి మూడు వేలకు పైగా ఫ్లాట్లతో కడుతున్న భారీ ప్రాజెక్టులపై జరుగుతున్న విచారణ త్వరలో పూర్తవుతుందని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
హైడ్రా చెరువుల మ్యాప్ : హైడ్రా కొన్ని ప్రాజెక్ట్ సంస్థలు తాము చెరువును ఆక్రమించలేదనే వాదన వినిపిస్తుండగా ఏళ్ల నాటి చెరువుల మ్యాప్‌ను హైడ్రా వారికి చూపెడుతోంది. త్వరలోనే ఆయా భవన సముదాయాల కూల్చివేత ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. హైడ్రా సైతం భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.
కమిషనర్ రంగనాథ్ ముక్కుసూటి వైఖరితో హైడ్రాపై సామాన్యుల్లో విశ్వాసం పెరిగింది. జలవనరుల పక్కనే ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఆక్రమణ జరిగిందా? లేదా? అని పక్కాగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలని జనం అభిప్రాయపడుతున్నారు. ఆయా నిర్మాణ సంస్థలు సైతం లేక్ వ్యూ పదాన్ని కొన్ని నెలలపాటు పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నాయి.