Hydra Remove Building Materials : హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఎఫ్టీఎల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి సారించింది. తొలుత నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాల తొలగింపును చేపట్టిన హైడ్రా, పూర్తి స్థాయిలో అక్కడి శిథిలాలను తొలగించి ఆ చెరువునకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
అందులో భాగంగా అక్కడి వ్యర్థాల్లో భవన నిర్మాణ యజమానులు వారికి అవసరమైన సామాగ్రిని తీసుకుపోగా, మిగిలిన శిథిలాలను జేసీబీల సహాయంతో లారీల్లో నగరం వెలుపలికి తరలిస్తోంది. ఎర్రకుంట ఎఫ్టీఎల్లో అక్రమంగా 5 అంతస్తుల్లో 3 భవనాలను నిర్మించారు. వాటిని గుర్తించిన హైడ్రా ఆగస్టు 14న కూల్చివేసింది. వ్యర్థాలను తొలగించని నిర్మాణదారుడికి నోటీసులిచ్చి ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న వ్యర్థాలను తొలగించే పనులను ప్రారంభించింది. ఎర్రకుంట చెరువులో హైడ్రా వ్యర్థాల తొలగింపుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
HYDRA On Restoration of Ponds :సహజ సిద్ధంగా ఏర్పడ్డ చెరువులను రాబోయే తరానికి, అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలి. ఆక్రమణలకు గురైన ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని సరస్సుల్లా మార్చాలి. ఈ లక్ష్యాలతో నూతన తరహాలో జలవనరులకు పునరుజ్జీవం కల్పించేందుకు హైడ్రా కసరత్తులు ప్రారంభించింది. ముందుగా 'చెరువులు ఎందుకు?' అనే చిన్న ప్రశ్నతో చర్చను ప్రారంభించింది. నీటి పారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులతో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్ పరిశోధన, నిపుణులతో కమిషనర్ ఏ.వి.రంగనాథ్ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.