Edulakunta Lake in Hyderabad :ప్రభుత్వ రికార్డుల్లో కనిపించకుండా పోయిన హైదరాబాద్‌లోని ఈదులకుంట చెరువు ఆచూకీ ఎట్టకేలకు హైడ్రా గుర్తించింది. కూకట్‌పల్లి, ఖానామెట్ గ్రామాల మధ్య ఆ కుంట గతంలో సుమారుగా 7 ఎకరాల్లో విస్తరించి ఉండేది. తుమ్మిడికుంట ఆక్రమణల్లో చిక్కుకుపోవడం, రోడ్డు విస్తరణ, పైవంతెన నిర్మాణ పనులతో వరద కాలువ మూసుకుపోవడంతో ఈదులకుంటలో చేరాల్సిన వరద, అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇండియా కాలనీల్లోకి మళ్లింది. దీంతో ఈదులకుంట భూమికి మంచి డిమాండ్ ఏర్పడింది.
ఖాళీగా కనిపించింది, కన్ను పడింది : అదే అదనుగా కొందరు ఈ కుంటపై కన్నేశారు. ఈ క్రమంలో కొందరు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, బల్దియా అధికారులతో చెరువును రికార్డుల్లో లేకుండా మార్పులు చేయించారు. గతంలోనే దీనిపై వివిధ వార్తా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. ఇటీవల హైడ్రా మాదాపూర్‌లోని తుమ్మిడికుంట వద్ద ఎన్-కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన సందర్భంగానూ ఈదులకుంట కనిపించకుండా పోయిన ఉదంతంపై కథనాలు వచ్చాయి.