Hydra Demolitions AT manikonda : అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా మరోసారి పంజా విసిరింది. తాజాగా నగరంలోని మణికొండ నెక్నాంపూర్లో పెద్దచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 13 విల్లాల నిర్మాణం జరిగిందని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈరోజు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్కడ హైడ్రా సిబ్బంది ఇప్పటి వరకు 5 విల్లాలను కూల్చివేశారు. ఇక్కడి నెక్నాంపూర్ చెరువును స్థానికులు కబ్జా చేసిన విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఆ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేతల సందర్బంగా పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పడిన హైడ్రా ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే మాదాపూర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి తన దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు పోతుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను ఆక్రమించి అక్రమార్కుల భరతం పడుతుంది. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలనకు వెళ్తున్నారు.