Hydra Demolitions At Kukatpally :కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణలపై హైడ్రా విరుచుకుపడింది. 6 గంటల్లో 16 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. చెరువు విస్తీర్ణంలో కబ్జాకు గురైన ఏడు ఎకరాల స్థలంలో ఆక్రమదారుల చెర నుంచి ఎకరానికిపైగా ప్రభుత్వ స్థలాన్ని విడిపించింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్లచెరువు క్రమంగా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లోని ఏడు ఎకరాలు అన్యక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రెండు రోజుల కిందట నల్ల చెరువు ప్రాంతంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో హైడ్రా డ్రోన్ సర్వే నిర్వహించింది. శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికలను సరిపోల్చుతూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించారు.
ఆరు గంటల హైడ్రా ఆపరేషన్ : బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్ మెంట్లు, ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 వాణిజ్య అవసరాల కోసం షెడ్ల నిర్మించినట్లు తేల్చారు. వాటిలో జనాలు ఉండే వాటిని మినహాయించి ఎఫ్టీఎల్లో వ్యాపారం సాగిస్తున్న షెడ్లను కూల్చివేయాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్న హైడ్రా బృందాలు స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను మొదలుపెట్టాయి. చెరువు పరిధిలో భారీ షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారిని హెచ్చరిస్తూ కూల్చివేతలు సాగించారు. రెండు జేసీబీ సహాయంతో అక్రమంగా నిర్మించిన మొత్తం 16 షెడ్లను మధ్యాహ్నం 12 గంటల కల్లా నేలమట్టం చేశారు.
బతుకుదెరువు కోసం వచ్చి వ్యాపారాలు :స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేట్ జూపల్లి సత్యనారాయణ నివాసాలకు అతి సమీపంలో ఉన్న నల్లచెరువు భూములు అన్యక్రాంతమవుతున్నా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. సమీపంలో పట్టా భూములున్నప్పటికీ వాటిలో కొందరు అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, మరికొందరు చెరువు భూములను కబ్జా చేసి మట్టితో నింపి షెడ్లు వేసి లీజుకు ఇచ్చారు. అందులో పాల వ్యాపారం, క్యాటరింగ్, డిజిటల్ ప్రింటింగ్, ప్లైవుడ్ సహా చిన్న చిన్న వ్యాపారాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆశ చూపి అక్కడి స్థలాన్ని లీజుకు ఇచ్చిన ఆక్రమణదారులు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.
అడుగట్టిపోయిన భూగర్భ జలాలు :వ్యాపారం చేసేవారికి తమ షెడ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయనే విషయం తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఆ నిర్మాణాల మూలంగా ప్రతి వర్షాకాలంలో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. చెరువు నిండకుండా అడ్డుకట్టలు వేయడం, తూములు తొలగించడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా అడుగట్టిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే వరద నీరు వెళ్లే కాలువ కూడా కుంచించుకుపోవడంతో చెరువు ఎగువన ఉన్న వెంకట్రావునగర్, శేషాద్రినగర్లతోపాటు చెరువు కింద ఉన్న సాయిబాబా కాలనీ, కేరళబస్తీ, దేవినగర్, గాయత్రినగర్ ప్రాంతాల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం హైడ్రా దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన సిబ్బంది చెరువులోని ఆక్రమణలను కూల్చివేశారు.