Hydra Demolished Prakruthi Resorts and Convention :ఇన్ని రోజులు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా ఇక నుంచి అనుమతులు లేకుండా ఉన్న హోర్డింగ్స్‌పై కూడా దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలోఅనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్‌ను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హోర్డింగ్స్ తొలగించాలని సూచించినా వినిపించుకోని ఏజెన్సీలపై మండిపడ్డారు.
వాటిని తొలగించాలని ఆదేశం :ఇప్పటికే ఇలా అనుమతులు లేకుండాశంషాబాద్, కొత్వాల్ గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఉన్న 53 భారీ హోర్డింగ్స్‌ను హైడ్రా తొలగించింది. 35 యూనిపోర్స్, 4 యూనిస్ట్రక్షర్స్, ఇళ్లపై ఏర్పాటు చేసిన 14 హోర్డింగ్స్‌ను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అనుమతులు ఉన్న హోర్డింగ్స్‌ను తొలగించమని స్పష్టం చేసిన రంగనాథ్, అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకృతి రిసార్ట్స్, కన్వెన్షన్ నేలమట్టం :మరోవైపు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణలపై హైడ్రా బుల్డోజర్లు వేగం పెంచాయి. నిన్నటి వరకు చిన్న చిన్న రేకుల షెడ్లను కూల్చివేసిన హైడ్రా, తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయంజాల్ గ్రామంలోని కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని దేవరయంజాల్ గ్రామస్థులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రకృతి రిసార్ట్స్ యజమానులు నోటీసులు ఇచ్చింది.