Hydra to Collaborates with NRSC for Satellite Maps :ఎంత పెద్ద విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు హైడ్రా హైదరాబాద్‌లో అతి పెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సందర్శించారు. కీలకమైన డేటా కోసం సుమారు మూడు గంటల పాటు ఎన్ఆర్ఎస్సీ అధికారులతో చర్చించారు. విపత్తు నిర్వహణలో హైడ్రా ఆలోచనలను అక్కడి అధికారులతో చర్చించారు.
వాతావరణ సూచనలు, వర్షపాతం స్థితిగతులు, విపత్తు నిర్వహణకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు అవసరమైన డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థను రంగనాథ్ పరిశీలించారు. ఈ ఏడాది వరకు ఉన్న చారిత్రక శాటిలైట్ వ్యూ డేటా ఆధారంగా నీటి వనరులు, నాలాలను పర్యవేక్షించడం, కచ్చితమైన ప్రణాళికతో పరిస్థితులను అంచనా వేయడం, భవిష్యత్లో ప్రణాళికల రూపకల్పన కోసం ఎన్ఆర్ఎస్సీ డేటా ఎంతో ఉపయోగపడుతుందని రంగనాథ్ తెలిపారు.
రూ.1000 కోట్ల విలువైన భూములకు విముక్తి :నగరంలోని ఆక్రమణలకు గురైన రూ.1000 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించినట్లు హైడ్రా తెలిపింది. ఈ మేరకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక వివరాల ప్రకారం జూన్ 27 నుంచి మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో మొత్తం 111.72 ఎకరాల భూమి ఆక్రమణల చెర నుంచి వీడింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల్లో చెరువులు ఎక్కువగా ఉన్నాయని, కొంతమేర బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మార్కెట్లో వాటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.