Hydra Ranganath Visits Ameenpur :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేఅవుట్లలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని, స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఐలాపూర్‌లో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితుల సమస్యలు వినేందుకు వచ్చిన కమిషనర్‌తో హైకోర్టు న్యాయవాది, స్థానికుడు ముఖీం మాట్లాడిన తీరుపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటన :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో కూల్చిన ఇళ్ల ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాధితుల సమస్యలు సావధానంగా వింటున్న సమయంలో న్యాయవాది ముఖీం జోక్యం చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తెలివి చూపొద్దంటూ సదరు లాయర్‌కు గట్టి హెచ్చరిక చేశారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని రెండు నెలల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. అసలైన అర్హులెవరో తేల్చుతామన్న కమిషనర్ రంగనాథ్, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
అసలైన లబ్ధిదారులు ఎవరన్నది తేల్చుతాం : 1980లో తాము కొన్న ఇంటి స్థలాలను ముఖీం అనే వ్యక్తి కబ్జాచేశారని హైడ్రాకు రాజగోపాల్ నగర్ అసోషియేషన్ బాధితులు ఫిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు. లేఅవుట్‌పై కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్వర్వులను పరిశీలిస్తామని వివరించారు. అసలైన లబ్ధిదారులు ఎవరన్నది తేల్చుతామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్ కూడా ఏర్పడుతోందని కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు