Hydra Commissioner Ranganath Visit To Ramnagar : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. మణెమ్మ గల్లీలో రోడ్డు ఇరుకుగా మారిందని నాలాలను, రోడ్డును ఆక్రమించారని ఆయనకు స్థానికులు తెలిపారు.
రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు : దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు ఆయనకు మొరపెట్టుకున్నారు. నాలా ఆక్రమణ, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సంబంధించిన స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
మీర్పేట్లోని గొలుసుకట్టు చెరువుల పరిశీలన :మరోవైపు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల అక్రమాలపై ఆరా తీశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను పరిశీలించారు. చెరువుల్లో ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను పరిశీలించారు. మీర్పేట్లో మూడు చెరువులు, సంధ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు ఈ మూడు గొలుసుకట్టు చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.