HYDRA Commissioner Ranganath Clarify to Demolitions :పేదలను ముందు పెట్టి చక్రం తిప్పుతున్న భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణలో సంచలనం రేపుతున్న హైడ్రా మరోసారి హెచ్చరించింది. పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. జులై తర్వాత అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలనే హైడ్రా కూల్చి వేస్తుందనే ప్రకటనతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో స్పందించిన రంగనాథ్ ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇస్తూ ఆయా వివరాలను వెల్లడించారు. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమని, FTLలో అనుమతి లేకుండా కట్టిన ఎన్ కన్వెన్షన్ లాంటి వాటిని కూల్చక తప్పదని రంగనాథ్ పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణతోపాటు చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తోన్న హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా వెనక్కి తగ్గిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ హైడ్రా పనితీరుపై సమగ్ర వివరాలను వెల్లడించారు. హైడ్రా రాక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ కూల్చబోమని, అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే కూల్చబోదని రంగనాథ్ స్పష్టం చేశారు.
FTLలో అనుమతులు లేకుండా కట్టిన ఎన్ కన్వెషన్ లాంటి వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమకట్టడాలుగా పరిగణిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అలాగే అనుమతులు రద్దైనప్పటికీ నిర్మాణాలు జరుగుతున్న వాటిని కూడా అక్రమ కట్టడాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు.
హైడ్రా వాళ్ల జోలికి వెళ్లదు - కూల్చివేతలపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
మల్లంపేట కత్వా చెరువు, అమీర్ పూర్‌లో కూల్చివేతలు అక్రమ కట్టడాల కిందకే వస్తాయన్నారు. పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న భూ కబ్జాదారులను ఉపేక్షించేది లేదని, చింతల్, గాజులరామారం, మాదాపూర్‌లోని సున్నం చెరువులో కూల్చివేతలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నవేనని తెలిపారు. గడిచిన 5 నెలల్లో 12 చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 12 చెరువులలో పునరుద్దరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టనున్నట్లు రంగనాథ్ వివరించారు.