Hyderabad Woman Anitha Grows Organic Vegetables : జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఆ జనాభా అవసరాలకు అనుగుణంగా వాహనాలు పెరుగుతున్నాయి, పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. దానితో పాటే కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ఆ ప్రభావం అన్నింటిపైనా పడుతోంది. మనుషుల ఆరోగ్యానికి ఆ కాలుష్యం ఎసరు పెడుతోంది. ఈ కాలుష్యం మాట అలా ఉంటే పండించే పంటలు సైతం రసాయనాల కారణంగా కలుషితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని కొంతైనా నివారించాలని భావించారు హైదరాబాద్ మహిళ అనిత. పాలీ హౌస్‌ను లీజుకు తీసుకుని అందులో సేంద్రీయ పద్ధతుల్లోకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల సాగు చేస్తున్నారు.
అనిత డిప్లొమా పూర్తి చేసి కొన్నాళ్లు ఓ ఎలక్రానిక్స్ సంస్థలో ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచి మెుక్కలు, పర్యావరణ పరిరక్షణ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇంటి పిట్టగోడ మీద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచేవారు. కొన్నాళ్ల తర్వాత వివాహం కాగా, భర్త, అత్తింటి వారికి కూడా మెుక్కలు, చెట్ల పెంపకంపై అభిరుచి ఉండటంతో అనిత మిద్దె సాగు ప్రారంభించారు. అయితే తాము అనుకున్న రితీలో మెుక్కలు పెంచలేకపోతున్నామని వారికి ఎక్కడో వెలితి ఉండేది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్మండలం ఖైతాపూర్లో అయిదెకరాల పాలీహౌస్ను లీజుకు తీసుకుని సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు.
వంటకాలతో ఉపాధి.. కొత్తకోట నారీమణుల ఐడియా అదుర్స్!
Organic Cultivation Uses In Telugu : మిద్దెసాగు సమయంలో అనిత ట్టుపక్కల ఉన్న అయిదారు కుటుంబాల వారికి రసాయన రహిత కూరగాయలను అందించే వారు. ఇప్పుడు పాలీ హౌస్లో సాగైన కూరగాయలను వివిధ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు.బయట పొలాల్లో పండించే పంటకు పాలీహౌస్లో పండించే పంటకు ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సేంద్రీయ పద్ధతుల్లో పండించే పంటలు కావడంతో పాలీ హౌస్కూరగాయల ధరలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇలాంటి కూరగాయల పట్ల అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో సాధారణ ధరలకే అందజేస్తున్నామని అనిత అంటున్నారు.
"నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ఇప్పుడు అందరూ రసాయనాలు వేసి మొక్కలు పెంచుతున్నారు. నేను ఎందుకు సేంద్రీయంగా కూరగాయలు పెంచకూడదు అనుకుని మొదలు పెట్టాను. ఇప్పుడు చాలా బాగుంది. ఔషధ మొక్కలు అందించేందుకు నర్సరీని మొదలుపెట్టాలి అనుకుంటున్నాం. సేంద్రీయ వ్యవసాయంపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాను." - అనిత, పాలిహౌజ్ వ్యవస్థాపకురాలు.
చౌటుప్పల్, బోయిన్పల్లి, మూసాపేట మార్కెట్లకూ, వివిధ కాలనీలకూ ఈ ధరలకే అందిస్తున్నామని చెబుతున్నారు. తమ పాలీహౌస్లో పండించే కూరగాయలు ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయని వెల్లడించారు. పరిశ్రుభ్రమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం ప్రారంభించిన పాలీహౌస్ మంచి లాభాలను ఇస్తోందని అంటున్నారు అనిత. దీంతో పాటు 12 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అనిత చెబుతున్నారు.