Passport Issued Problems : మైనర్ పాస్‌పోర్టుకు సంబంధించి తల్లిదండ్రుల అంగీకారంతో దాఖలు చేసే దరఖాస్తులు మినహాయిస్తే మనస్పర్థలతో విడిపోయిన, లేదంటే సింగిల్ పేరెంట్ లేదా తల్లిదండ్రులు మరణించిన సందర్భాల్లో సరైన ధ్రువపత్రాలు సమర్పించలేక ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రతి నెలా 30 నుంచి 40 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లోకి ఎగబాకింది. కొందరు తల్లిదండ్రులు కోర్టులో వారి విడాకుల కేసు ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు.
పోలీస్ తనిఖీలలో ఇవి వెల్లడవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మైనర్ పాస్‌పోర్టుల జారీకి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసిందని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ (ఆర్పీవో) తెలిపారు. వెబ్‌సైట్ https://www.passportindia.gov.in/ లో పూర్తి వివరాలు లభ్యమవుతాయని వెల్లడించారు. తల్లిదండ్రులు మరణిస్తే నానమ్మ, అమ్మమ్మ లేదా తాత లేదా బంధువులు మైనర్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందన్నారు. మైనర్ పాస్‌పోర్టుల జారీలో అధికారుల దృష్టికి వచ్చిన పలు సమస్యలు, పరిష్కార మార్గాలను ఆమె తెలిపారు.
తల్లిదండ్రుల విడాకుల సందర్భంలో..
1. విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు చేసే మైనర్ పాస్‌పోర్టు దరఖాస్తుకు తల్లిదండ్రులిద్దరి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. పరస్పర అంగీకారం లేకుండా విడిపోయినప్పుడు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు అనుమతిస్తే తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఒకరి ధ్రువీకరణతో పాస్‌పోర్టు మంజూరవుతుంది.
2. విడాకులు మంజూరు చేసినప్పుడు న్యాయస్థానం తల్లిదండ్రుల్లో ఒకరికి మైనర్ బాధ్యతలు అప్పగిస్తుంది. మరొకరు పిల్లలను కలుసుకునే హక్కులు ఇవ్వకపోతే సింగిల్ పేరెంట్ సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టు మంజూరవుతుంది. కోర్టు ఆదేశానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి.