Police Arrested Drug Gang In Hyderabad :హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరవేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నంచి రూ.1.10కోట్లు విలువ చేసే 256 గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నైజీరియా దేశానికి చెందిన ఒఫొజోర్ సండే ఎజికె అలియాస్ ఫ్రాంక్ 2016 లో స్పోర్ట్స్ వీసాపై భారత్‌కు వచ్చాడు. దిల్లీలోని స్టార్ ఆఫ్రికన్ స్పోర్ట్ క్లబ్‌లో చేరి రెండేళ్ల పాటు ఫుట్‌బాల్ ఆడాడు. 2018లో బెంగళూరుకి మకాం మార్చిన ఫ్రాంక్ వస్తున్న ఆదాయం సరిపోక అక్కడ మరో నైజీరియన్ ద్వారా డ్రగ్స్ మాఫియాలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన అనాస్ తన తండ్రి చనిపోవడంతో కుటుంబంతో సహా బెంగళూరులో ఉంటున్నాడు.
డ్రగ్స్‌కు బానిసగా మారి :బెంగళూరుతో పాటు హైదరబాద్‌లో కార్ షిఫ్టింగ్ పని చేస్తున్న అనాస్ డ్రగ్స్‌కి బానిసగా మారాడు. ఇదే క్రమంలో కోల్‌కతాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అమె కూడా డ్రగ్స్‌కు బానిస అవ్వడంతో ఆమె ద్వారా అనాస్ ఖాన్‌కు ఫ్రాంక్ పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరూ కలిసి డ్రగ్స్ దందా ప్రారంభించారు. అనాస్ ఖాన్ ఫ్రాంక్ వద్ద తక్కువ ధరకు పలు రకాల డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. తన సోదరుడు సైఫ్ ఖాన్ ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ డెలివరీ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.