Police Bust Drug Racket in Hyderabad : హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు అమీర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి స్మగ్లర్‌గా మారినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ముంబయి, గోవా, బెంగళూరుల్లో తక్కువ ధరకు ఎండీఎంఏ కొనుగోలు చేసి వాటిని నగరంలో రెట్టింపునకు విక్రయించి లాభాల రుచి చూశాడు. డ్రగ్స్ లావాదేవీల్లో సలీంతో అమీర్‌కు పరిచయం ఏర్పడంతో కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సలీం హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకొని ముంబయికి మకాం మార్చాడని పోలీసుల విచారణలో తేలింది. అదే ప్రాంతానికి చెందిన రయీస్ రియాజ్‌తో కలిసి ఎండీఎంఏ భారీ ఎత్తున ఏపీ, తెలంగాణకు సరఫరా చేసేందుకు ప్రణాళికను వేశారు.
దిల్లీలో ఉంటున్న నైజీరియన్ ప్రధాన డ్రగ్ డీలర్లులు జిమ్మి, జెర్రీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ముంబయిలో రయీస్ వారి వద్ద నుంచి డ్రగ్స్ తీసుకొని సలీంకు అందజేసేవాడు. అమీర్ ఎల్.జి.బి.టి, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ క్యూ కమ్యూనిటీల యాప్‌ల్లోకి మారుపేర్లతో చేరేవాడు. అక్కడ సింథటిక్ డ్రగ్స్ తీసుకునేవారిని లక్ష్యంగా చేసుకొని ఎండీఎంఏ విక్రయించడం ప్రారంభించాడని అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఆ యాప్‌ల్లో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ఏజెంట్లుగా మలచుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. వారికి కావాల్సిన మాల్‌ను కొరియర్, డెడ్‌డ్రాప్ పద్థతిలో చేరవేసేవాడని పోలీసులు గుర్తించారు.
ఆరు నెలలపాటు సాగిన డెకాయ్ అపరేషన్ వేటలో :వాట్సాప్ గ్రూపులు, యాప్‌లు, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారమార్పిడి సాగిస్తూ మూడేళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్నారని అధికారులు తెలియజేశారు. ఇటీవల టీజీన్యాబ్ పోలీసులు సికింద్రాబాద్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన సమాచారంతో డెకాయ్ అపరేషన్ చేపట్టారు. దాదాపు ఆరు నెలలపాటు సాగిన వేటలో లభించిన కొద్దిపాటి ఆధారంతో నిందితుడిని పట్టుకున్నారు. ముంబయిలో హమీద్ నుంచి 320 గ్రాముల ఎండీఎంఏ రూ.6 లక్షలకు కొనుగోలు చేసి ప్రయివేటు వాహనంలో నాంపల్లి చేరుకున్న అమీర్‌ను ఈ నెల 18న అరెస్ట్ చేశారు.