Hyd Cop Arrest Bangalore Man :బెంగళూరు నగరంలో ఖరీదైన ప్రాంతంలో నివాసం, అందుకు నెలకు రూ.75 వేల అద్దె, లగ్జరీ కార్లతో తిరుగుతూ జల్సాలు, ఇదంతా ఓ వ్యాపారవేత్త జీవనశైలి కాదు డేటింగ్ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ అవతలి వ్యక్తుల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు వసూలుచేసే హైటెక్ నేరగాడి లగ్జరీ జీవితం. డేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా ప్రవాస భారతీయులు, అమెరికన్లను బురిడీ కొట్టిస్తున్న ఘరానా కేటుగాడిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టుచేశారు.
వివరాల్లోకెళ్తే :బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన యువకుడు రిద్ బేడి(26) గతంలో అమెరికాలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆరేళ్లు యూఎస్‌లో ఉండి తిరిగి బెంగళూరుకు వచ్చాడు. ఓ ప్రముఖ సంస్థలో ప్రొడక్ట్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తూ విలాస జీవితం అనుభవించేవాడు. రోల్‌ప్లేయింగ్ గేమ్స్(ఆన్‌లైన్ గేమ్స్)కు అలవాటుపడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పక్కదారి పట్టాడు. నేరావతారం ఎత్తాడు.
అమ్మాయిల చిత్రాలతో ఎర : ఇంటర్నెట్‌లో డేటింగ్ వెబ్‌సైట్ల నుంచి అందమైన యువతుల ఫొటోలు తీసుకుని, వాటితో నకిలీ ప్రొఫైళ్లు తయారుచేసి పురుషులతో చాటింగ్ చేసేవాడు. ఇండియన్స్‌ను మోసగిస్తే ఇక్కడి పోలీసులతో ఇబ్బందని, కేవలం అమెరికన్లు, అక్కడి ప్రవాస అమెరికన్ ఇండియన్లను లక్ష్యంగా చేసుకుని బురిడీ కొట్టించేవాడు. అమ్మాయిలా నటిస్తూ అర్ధనగ్న చిత్రాల్ని అవతలివారికి పంపి ట్రాప్‌లోకి దించుతాడు.