Ganesh Immersion 2024 : హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.
మెట్రోలో రద్దీ : ఈ నెలలో ఖైరతాబాద్ గణేశ్ సందర్శనతో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా నమోదైందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం (సెప్టెంబరు 14వ తేదీ) ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 94 వేల మంది ప్రయాణించారని తెలిపారు. 39వేల మంది ఎంట్రీ, 55 వేల మంది ఎగ్జిట్లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో నమోదైనట్లు వివరించారు.
ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.