Hyderabad Metro Income 2023-24: ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ మెట్రో సంస్థ ఆదాయం అమాంతం పెరిగింది. ఏకంగా 105 శాతం పెరిగినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొంది. ఈ సంస్థను ఎల్ అండ్ టీ నిర్వహిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగిందని నివేదికలో తెలిపింది. ఫలితంగా గతేడాది నష్టాలు భారీగా తగ్గాయి. 2022-23లో రూ.1315.99 కోట్ల నష్టాన్ని చూపించిన ఆ సంస్థ గతేడాది రూ.555.04 కోట్లకు తగ్గినట్లు నివేదికలో వెల్లడించింది. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయని పేర్కొంది.
Hyderabad Metro Revenue Last Financial Year : గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రూ.611.48 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపింది. టీవోడీ ద్వారా రూ.796.33 కోట్లు వచ్చినట్లు నివేదికలో చూపించింది. ఇందులో అద్దెల ద్వారా రూ.110.42 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.81.06 కోట్లు, ఇతరత్రా రూ.82.77 కోట్లు వచ్చాయి. మెట్రోకు ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని భూమిని స్లంప్‌సేల్ రూపంలో రహేజా గ్రూప్, బ్రూక్‌ఫీల్డ్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడం ద్వారా మొదటి విడతగా రూ.511.73 కోట్లు వచ్చాయి. దీంతో ఆదాయం పెరిగింది.
హైదరాబాద్ మెట్రో మరో మైలురాయి - ఆరున్నరేళ్లలో 50 కోట్ల ప్రయాణికులు - Hyderabad Metro 50 crore passengers
Hyderabad Metro Expenditure Details : మెట్రోరైలు ఆపరేషన్స్‌కు రూ.400.06 కోట్లు, ఉద్యోగుల వేతన ప్రయోజనాలు రూ.35.85 కోట్లు, పరిపాలన, ఇతర ఖర్చులు రూ.36.03 కోట్లు అయిందని సంస్థ పేర్కొంది. మెట్రో నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై చెల్లించిన వడ్డీ గతేడాది రూ.1173.11 కోట్లు అని గుర్తు చేసింది. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ భారం స్వల్పంగా తగ్గిందని పేర్కొంది. 2022-23లో వార్షిక వడ్డీ భారమే రూ.1273.36 కోట్లుగా ఉందని వెల్లడించింది. మొత్తంగా వ్యయం రూ.1962.85 కోట్లుగా నివేదికలో చూపారు. ఆదాయం 1407.81 పోగా రూ.555.04 కోట్ల నష్టాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూపించింది.
Hyderabad Metro Latest News : మెట్రోరైళ్లు భాగ్యనగరంలో ఆరు సంవత్సరాలుగా పరుగులు తీస్తున్నాయి. కొవిడ్ సమయంలో మెట్రోకు భారీగా నష్టాలు వచ్చాయి. 2022 మార్చి 31 నాటికి రూ.4108.37 కోట్లు ఉండగా 2023 మార్చి 31 నాటికి రూ.5424.37 కోట్లకు పెరిగిపోయింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరినట్లుగా ఆర్థిక నివేదికలో ఎల్ అండ్ టీ మెట్రో వివరించింది. ప్రజల నుంచి మెట్రోకు ఆదరణ తగ్గడం లేదు. సోమవారం ఉదయం రోజువారీ కంటే ముందే సేవలు ప్రారంభిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించారు.
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - నేటి నుంచి మెట్రో రైలు వేళలు పొడిగింపు - Hyderabad Metro Timings Extended