Hyderabad Metro Rail Story In Stanford Journal :తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెట్రో ప్రాజెక్ట్ విజయగాథను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్) తన తాజా సంచికలో ప్రచురించింది. హైదరాబాద్ మెట్రోకు(Hyderabad Metro) ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆచార్యులు హర్షం వ్యక్తం చేశారు.
ISB Study On Hyderabad Metro :ఇది ఒక భారతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఐఎస్‌బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలుతో పాటు వాటిని అధిగమించేందుకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ ప్రచురిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల విస్తృత అధ్యయనాల గట్టిపోటీ నడుమ ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ఆచార్యులు రామ్ నిడుమోలు, ఆయన బృందంహైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro Rail Project)పై క్షుణ్నంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా ఎంచుకుని ప్రచురించింది.