Hyderabad Airport records 2 crore passengers Travel : జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని ఎయిర్‌పోర్టుల నుంచి ప్రయాణికుల రాకపోకలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) మీదుగా ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి, ఇతర విమానాశ్రయాలతో పోల్చితే అధికంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2023 ఇదే నెలతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 14 శాతం వృద్ధి నమోదైంది.
Shamshabad Airport in Hyderabad : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో ఇప్పటి వరకు (2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు) హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య గత ఆర్థిక ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం అధికంగా ఉంది.
దిల్లీ విమానాశ్రయం నుంచి గత నెలలో 62.94 లక్షల మంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.07 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి. 2023 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ప్రయాణికుల సంఖ్య 8 శాతం అధికం కాగా, ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల రాకపోకలు 14 శాతం పెరిగాయి. అంటే ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి దిల్లీ కంటే, హైదరాబాద్ విమానాశ్రయంలో ఎక్కువగా ఉంది.
విమానాల రాకపోకల్లో 13 శాతం వృద్ధి : జీఎంఆర్ గ్రూప్ (GMR Group)సారథ్యంలో హైదరాబాద్, దిల్లీ విమానాశ్రయాలతో పోటు మోపా (గోవా), మేడన్ (ఇండోనేషియా), సెబు (ఫిలిప్సీన్స్) విమానాశ్రయాలున్నాయి. వీటన్నింటిమీద చూసినా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఉంది. విమానాల రాకపోకల్లోనూ 13 శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరం క్రితం ప్రారంభమైన మోపా విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.